
వాహన పూజకు ‘నకిలీ’ టికెట్లు?
పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద వాహన పూజకు నకిలీ టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పటిలాగే దసరా పర్వదినం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచి ఆలయానికి వేలాది వాహనాలు పూజ కోసం వచ్చాయి. వాహన పూజతో ఎండోమెంట్‌కు రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇందుకోసం వాహనదారులు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి వాహన పూజ టికెట్ల విక్రయాలపై ఈఓ పర్యవేక్షణ కొరవడటంతో నకిలీ టికెట్లు వచ్చినట్లు వాహనదారులు ఆరోపించారు. టికెట్లపై ఈఓ, సంబంధిత క్లర్క్ సంతకాలు లేవు. రశీదుపై ఖమ్మం జిల్లా ఎండోమెంట్ శాఖ ముద్ర మాత్రమే ఉంది. పూజలు చేసిన తేదీ, వాహనదారులు చిరునామా వివరాలు కూడా నమోదు చేయలేదు. దేవాదాయశాఖ ఉద్యోగులు లేకుండా ప్రైవేట్ వ్యక్తులు నకిలీ రశీదులతో వేలాది రూపాయలను వాహనదారుల నుంచి వసూళ్లు చేశారు. వాహనాల పూజ టికెట్ల విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, వాహనదారులు కోరుతున్నారు.
గాంధీ జయంతి రోజూ ఆగని జంతు బలి
ఈ నెల 2న గాంధీ జయంతి. దీనికితోడు శ్రీదేవీ శరన్నవ రాత్రి మహోత్సవాల చివరి రోజు. దీంతో ఆలయం సముదాయంలో, పరిసర ప్రాంతాల్లో జంతుబలి నిషేధం అమలు చేయాలి. కానీ దసరా పండుగ అని ఆలయంలో మేకలు, గొర్రెలు, కోళ్లను యథేచ్ఛగా వధించారు. బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగాయి. ఆలయ ఈఓ, ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. జంతు బలిపై భక్తులు ఫిర్యాదు చేసినా ఈఓ స్పందించలేదని, జంతుబలిని పరోక్షంగా ప్రోత్సహించారనే విమర్శలు వ్యక్తవుతున్నాయి. ఈ వ్యవహారంపై పెద్దమ్మతల్లి ఆలయ ఈఓ ఎన్.రజినీకుమారిని వివరణ కోరగా.. టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరగలేదని తెలిపారు.
పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ప్రైవేటు వ్యక్తుల దందా