
దసరా వేడుకల్లో అపశృతులు
కల్లూరురూరల్: మండలంలోని కప్పలబంధంలో గురువారం రాత్రి దసరా సందర్భంగా బతుకమ్మ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో పండుగ కోసం స్వగ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కప్పలబంధం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేముల శ్రీనివాసరావు(48) కల్లూరు మండలం రఘునాథగూడెం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుండగా ఇటీవలే డిప్యూటేషన్‌పై కల్లూరుకు కేటాయించారు. దసరా సందర్భంగా కప్పలబంధం రాగా గురువారం రాత్రి బతుకమ్మ ఊరేగింపు చూసేందుకు వెళ్లారు. రోడ్డు పక్కన ఆయన నిలబడి ఉండగా, బతుకమ్మ ఊరేగింపుకు సంబంధించి ట్రాక్టర్‌ను వెనక్కి తీసే క్రమంలో రోడ్డు శంకుస్థాపన శిలాఫలకం దిమ్మెకు తాకి అది విరిగి ఆయనపై పడింది. దీంతో తీవ్రగాయాలైన శ్రీనివాసరావుకు కల్లూరులో చికిత్స అనంతరం ఖమ్మం తరలించగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. దసరా సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన శ్రీనివాసరావు మృతితో విషాదం నెలకొనగా, యూటీఎఫ్, పీఆర్‌టీయూ సంఘాల నాయకులు సంతాపం తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
పెనుబల్లి: పెనుబల్లి బీసీ కాలనీ మసీద్‌రోడ్డులో యూ టర్న్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పడిగా సాయి(25) మృతి చెందాడు. పెనుబల్లి మండలం వీ.ఎం.బంజరుకు సాయి దసరా సందర్భంగా గురువారం మిత్రులతో సరదాగా గడిపాక స్నేహితుడి కొత్త బైక్‌పై ట్రయల్ రన్ కోసమంటూ మరో స్నేహితుడు సిద్ధార్థతో కలిసి వెళ్లాడు. కొత్తగూడెం జాతీయ రహదారిపై వెళ్తుండగా మసీదు వద్ద యూ టర్న్ తీసుకునే క్రమంలో వీరి బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఘటనలో సాయి తలకు బలమైన గాయం కాగా 108 వాహనంలో పెనుబల్లి ఆస్పత్రికి, అక్కడ ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో యువకుడు సిద్ధార్థకు కూడా బలమైన గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వీ.ఎం.బంజరు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు.
బతుకమ్మ ఊరేగింపులో దిమ్మె పడి
టీచర్ మృతి

దసరా వేడుకల్లో అపశృతులు