
పర్యావరణ హితం
15 మండలాల ఎంపిక..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో
రెండేళ్ల పాటు నిర్వహణ
15 మండలాల్లో 1,875 ఎకరాలు
ఎంపిక
ఇప్పటికే మట్టి నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియ పూర్తి
ప్రయోజనకరమైన పథకం
ప్రకృతి సేద్యం..
ఖమ్మంవ్యవసాయం: రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రకృతి సేద్యం’ పథకానికి శ్రీకారం చుట్టింది. రసాయన రహిత సాగు వైపునకు రైతులను మళ్లించి ఆరోగ్యవంతమైన ఆహారోత్పత్తులను అందించడం ఈ పథకం లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని రాష్ట్రంలో ‘నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’(ప్రకృతి వ్యవసాయ మిషన్) పేరిట అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో బయో రిసోర్స్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తారు. జిల్లాలో ఇప్పటికే కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలోని పలువురు రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థల నుంచి అవార్డులు కూడా అందుకున్నారు.
యాసంగి నుంచి అమలు..
ప్రకృతి సేద్యం పథకాన్ని జిల్లాలో యాసంగి సీజన్ నుంచి అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని నిర్వహిస్తాయి. రసాయనాలు లేని పంటల సాగే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభమైంది. ఈ నెల నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభమవుతున్న వేళ జిల్లాలో రూపొందించిన ప్రకృతి సేద్యం పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
కేంద్ర, రాష్ట్రం నుంచి నిధులు..
ప్రకృతి సేద్యం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల పాటు సంయుక్తంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను ఖర్చు చేస్తుంది. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు, వివిధ రకాల ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. పంటల సాగులో పెట్టుబడి భారాన్ని తగ్గించి, దిగుబడి పెంచే పద్ధతులను ప్రోత్సహించనున్నారు.
పరీక్షలు పూర్తి
ప్రకృతి సేద్యం పథకం కింద ఎంపిక చేసిన క్లస్టర్లలో పంటలు సాగు చేసే భూముల్లో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించారు. తద్వారా ప్రకృతి సేద్యం చేసే భూముల్లో ఉన్న పోషకాలు, వివిధ పంటలకు అవసరాలు అనే అంశాలపై అధ్యయనం చేసి పోషక లోపాల సవరణలకు కూడా చర్యలు చేపట్టనున్నారు.
జిల్లాలో ‘నేచరల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ పథకానికి 15 మండలాలను ఎంపిక చేశారు. కామేపల్లి, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, మధిర, ఎర్రుపాలెం, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు మండలాలను ఎంపిక చేయగా.. ఒక్కో మండలం నుంచి ఒకటి, రెండు గ్రామాలను క్లస్టర్‌గా గుర్తించారు. వాటి పరిధిలో 125 మంది రైతులు, 125 ఎకరాల చొప్పున ఎంపిక చేయగా, 15 మండలాల్లో 1,875 మంది రైతులు, 1,875 ఎకరాల భూమిని సేద్యం చేసేలా కార్యాచరణ రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న రైతులనే ఈ పథకానికి ఎంపిక చేశారు. అంతేగాక విషయ పరిజ్ఞానాన్ని సహచర రైతులకు పరిచయం చేయగలిగే వారికి ప్రాధాన్యం ఇచ్చారు. క్లస్టర్ల వారీగా మండలానికి ఇద్దరు చొప్పున 30 మంది సీఆర్‌పీలను ఎంపిక చేయగా, వారికి గౌరవ వేతనం అందించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన సీఆర్‌పీలకు ఇప్పటికే కేవీకే శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు శిక్షణ ఇప్పించారు.
జిల్లాలో యాసంగి సీజన్ నుంచి పథకం అమలు
నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పేరిట రూపొందిన ప్రకృతి సేద్యం పథకం ఎంతో ప్రయోజనకరమైంది. రసాయన రహిత వ్యవసాయం లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. జిల్లా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెరుగుతుంది. ఇప్పటికే పలువురు రైతులు సహజ వ్యవసాయం చేస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. యాసంగి సీజన్ నుంచి జిల్లాలో పథకం అమలుకు చర్యలు చేపట్టాం.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

పర్యావరణ హితం

పర్యావరణ హితం