
రైతులకు మద్దతు ధర అందాలి
ఖమ్మంవ్యవసాయం: పంటలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివా రం.. ధాన్యం కొనుగోళ్లు, సీసీఐ పత్తి కొనుగోళ్లపై అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంటల కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. వానాకాలం వరిసాగు ఆధారంగా 2.60 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 40 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలనేది లక్ష్యమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లతో పాటు 3 నుంచి 4 నెలల పాటు మిల్లింగ్ చేయాల్సిన అవస రం ఉందన్నారు. తూర్పారబట్టిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ క్లస్టర్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఏఈఓ లు సర్టిఫై చేయాలన్నారు. అవసరమైన మేరకు తేమ యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పత్తి కొనుగోలు సులభతరం చేసేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మార్కెటింగ్ శాఖ డిప్యూ టీ డైరెక్టర్ పద్మావతి మాట్లాడుతూ.. పత్తి ధర పడిపోతున్న నేపథ్యాన కనీస మద్దతు ధర రైతులకు దక్కేలా సీసీఐ ద్వారా కొనుగోలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. తేమశాతం ఆధారంగా పంట కొనుగోలు ఉంటుందని, 8శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ. 8,110 ధర ఉంటుందని తెలిపారు. తేమశాతం పెరుగుతుంటే ధరలో తేడా ఉంటుందని, ఈ విషయమై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో డీఏఓ ధనసరి పుల్లయ్య, డీఎంఓ ఎంఏ అలీం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత పాల్గొన్నారు.