
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
● నామినేషన్ల స్వీకరణకు మండలాల్లో ఏర్పాట్లుచేయాలి ● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మం సహకారనగర్ : స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈనెల 6న మొదటి దశ ర్యాండమైజేషన్ తర్వాత విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించొద్దని, అభ్యర్థితో పాటు ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, అదనపు డీఆర్డీఓ జయశ్రీ, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన..
తిరుమలాయపాలెం/ముదిగొండ/నేలకొండపల్లి : స్థానిక సంస్థల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శనివారం పరిశీలించారు. శనివారం ఆమె తిరుమలాయపాలెం, ముదిగొండ, నేలకొండపల్లి ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలు, పోస్టల్ బ్యాలెట్ కవర్లు తదితర సామగ్రిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ వివరాలు, వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓలు సిలార్‌సాహెబ్, శ్రీధర్‌స్వామి, ఎం.ఎర్రయ్య, అధికారులు శారదాదేవి, బి.చలపతిరావు, ఏఈ ప్రసాద్, భాస్కర్‌రావు, సిబ్బంది శ్రీనివాస్, మీరా తదితరులు పాల్గొన్నారు