
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, శ్రీ స్వామివారి విగ్రహానికి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం గావించారు. శ్రీవారిని, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర అన్నదాన సేవా సమితి నిర్వాహకులు బొబ్బొ కృష్ణప్రసాద్, ఎల్వీ నారాయణరెడ్డి, కాకుమాను లీలాకృష్ణ, ఇమ్మడి ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, చొప్పవరపు శ్రీనివాసరావు, గిరిజాలక్ష్మి, తదితరులు 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో నేడు మంత్రి
పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన పర్యటన ప్రారంభం కానుండగా ఖమ్మం నగరంతో పాటు కూసుమంచి, మధిర, వేంసూరు మండలాల్లో కొనసాగుతుంది. ఆయా మండలాల్లో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
‘రేషన్’ పక్కదారి పడితే సహించం
కారేపల్లి: రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి (డీఎస్‌ఓ) చందన్‌కుమార్ అన్నారు. కారేపల్లిలోని సింగరేణి –1, 2 రేషన్ దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల ఎదుట బోర్డు ఏర్పాటు చేసి సరుకుల నిల్వ వివరాలను పొందుపరచాలని, నిర్దేశిత సమయంలో లబ్ధిదారులకు సన్నబియ్యం అందించాలని డీలర్లకు సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫ్లెక్సీలు లేకుండా చూడాలన్నారు.
రేపు అండర్ –19 టీటీ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్ : ఉమ్మడి జిల్లాస్థాయి అండర్– 19 బాలబాలికల టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపికలు ఈనెల 6న ఉదయం 9 గంటలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసాకలీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తేదీన బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న వారు పోటీలకు అర్హులని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.