
వన్య‘ప్రాణం’ తీయకండి!
జంతువులను వధిస్తే ఏడేళ్ల వరకు జైలు
రక్షణ చట్టాలున్నా
ఆగని అటవీ జంతువుల వధ
జిల్లాలో పలుచోట్ల కేసులు,
నిందితుల అరెస్ట్
10 తేదీ వరకు వన్యప్రాణుల
వారోత్సవాలు
పాల్వంచరూరల్: జంతు సంరక్షణకు చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, అటవీశాఖ సిబ్బంది గస్తీ తిరుగుతున్నా, ట్రాప్ కెమెరాలు అమర్చినా జంతువులకు వేటగాళ్ల నుంచి రక్షణ కరువైంది. జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో చుక్కల దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు, కొండ గొర్రెలు, కణుజు, చిరుత పులులు, సాంబర్లు, ఎలుగుబంట్లు, అడవి దున్న వంటి వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం 1977 జనవరి 24న కిన్నెరసానిని అభయారణ్యంగా ప్రకటించారు. కానీ పలుమార్లు జంత వధ జరుగుతూనే ఉంది. జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నా వన్యప్రాణులకు రక్షణలేకుండా పోయింది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ ఫారెస్ట్ డివిజన్ల ఆధ్వర్యంలో కూడా వారోత్సవాలు చేపడుతున్నారు. ప్రభుత్వ సెలవు దినాలు కాకుండా ఏడురోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
వన్యప్రాణులను హతమార్చిన
ఘటనలు కొన్ని..
● వన్యప్రాణులు వేటాగాళ్ల వేటుకు బలవుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు వేసి వధిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న దమ్మపేట రేంజ్‌లో దుప్పిని వేటాడి చంపి మాంసాన్ని వండుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు.
● గతంలో కిన్నెరసాని డీర్ పార్కు సమీపంలోనే దుప్పిని కుక్కలతో వేటాడారు. పాల్వంచ మండలం సోములగూడెం రోడ్డులోని అటవీ ప్రాంతంలో దుప్పిని వధించి మాంసం విక్రయించారు. అటవీశాఖాధికారులు ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేశారు.
● దంతెలబోరు అటవీప్రాంతంలో అడవి పందిని చంపి మాంసాన్ని విక్రయించగా, అధికారులు పట్టుకున్నారు. ఏడుళ్లబయ్యారం అటవీప్రాంతంలో దుప్పిని బాణాలతో వేటాడి సంహరించారు. ములకలపల్లి, చండ్రుగొండ అటవీ ప్రాంతాల్లో కూడా వన్యప్రాణులను వధించిన సంఘటనలు ఉన్నాయి. ఇల్లెందు డివిజన్‌లో విద్యుత్ ఉచ్చులతో అడవి దున్నలను వధించారు.
● రెండున్నరేళ్ల క్రితం ఉల్వనూరు వద్ద ఎలుగుబంటిని వధించగా, ఐదుగురిపై కేసుమోదు చేశారు. రెండేళ్ల క్రితం అలుగును చంపి వాటి పెంకులను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఇలా ఏటా జిల్లా అటవీప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల ఉసురు తీస్తున్నారు.
అటవీ జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అటవీ గ్రామాల్లో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు వంటివి చేపడుతున్నాం. తొలిరోజు నాకా బందీ నిర్వహించాం. రాత్రి, పగలు వాహనాలను తనిఖీలు చేపట్టాం. –బి.బాబు, వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ
జంతువులను వధిస్తే 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేల నుంచి రూ. లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. వన్యమృగాల సంరక్షణ చట్టం 1972 ప్రకారం పులి, చిరుత, నెమలి, ఎలుగుబంటి, కుందేలు, పక్షులు, మొసళ్లు, అడవి దున్న, దుప్పి తదితర జంతువులను వధించడం నేరం.
పులిని చంపినా, చర్మం, గోళ్లు తీసినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా సెక్షన్ 51(ఎ) కింద 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఏడాదిపాటు బెయిల్ కూడా లభించదు. చిరుతపులిని వధించినా ఇవే శిక్షలు విధిస్తారు.
ఎలుగుబంటి చంపినా, పట్టుకున్నా, సర్కస్‌లో ఆడించినా 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. వేటాడినట్లు రుజువైతే సెక్షన్ 37(ఏ)కింద 3 నుంచి 7 ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
కోతులను పట్టుకున్నా, చంపిన, ఇంట్లో పెంచుకున్నా, అది నివాసం ఉండే ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా 5 నుంచి7 నెలలపాటు జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమాన విధించే అవకాశం ఉంది.
కుందేళ్లను చంపినా, పట్టుకున్నా, ఇంట్లో పెంచుకున్నా మూడేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు.
నెమళ్లను పట్టుకున్నా, వధించినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా, వాటి గుడ్లను పగులగొట్టిన, హాని చేసినా, వైల్డ్‌లైఫ్ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 25 నుంచి రూ. లక్ష వరకు జరిమాన విధించే అవకాశం ఉంది.
పశువులను చంపినా, నిర్బంధించినా, సంతానం కలగకుండా చేసినా, తాళ్లు, గొలుసులతో బంధించి వాహనాల ద్వారా తరలించినా రూ. 25వేలకు పైగా జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.
నేడు ప్రపంచ జంతు దినోత్సవం

వన్య‘ప్రాణం’ తీయకండి!

వన్య‘ప్రాణం’ తీయకండి!