
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
బోనకల్: మండలంలోని నారాయణపురం గ్రామానికి సూర్యదేవర మురళీకృష్ణ(35) గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో హైదరాబాద్‌కు చెందిన వైష్ణవిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లుగా దంపతుల నడుమ కలహాలతో వైష్ణవి కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. నారాయణపురంలో ఇంటి వద్ద ఉంటున్న మురళీకృష్ణ మద్యానికి బానిసగా మారి.. ఇంట్లో ఎవ్వరు లేని సమయాన ఉరి వేసుకున్నాడు. ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.వెంకన్న తెలిపారు.
సైబర్ నేరంలో నిందితుడి అరెస్టు
ఖమ్మంక్రైం: ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.11.49 లక్షలు కాజేసిన కేసులో ఓ నిందితుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా ఏర్పడిన నిందితులు రిటైర్డ్ ఉద్యోగికి మాయమాటలు చెప్పి ఆయన ఖాతా నుంచి నగదు కాజేశారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లికి చెందిన కావలి శ్రీనివాస్ ముఠా తస్కరించే నగదును కొన్ని అకౌంట్లలో జమ చేసేందుకు సహకరిస్తున్నాడు. ఈమేరకు శ్రీనివాస్‌ను గురువారం ఆయన స్వగ్రామంలో అరెస్ట్ చేసి ఖమ్మం సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచాక రిమాండ్‌కు తరలించారు. కాగా, కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ సీహెచ్‌ఆర్‌వీ.ఫణీదర్, ఎస్సైలు రంజిత్‌కుమార్, విజయకుమార్, కానిస్టేబుళ్లు కృష్ణారావు, ఉదయభానుమూర్తిని ఖమ్మం సీపీ సునీల్‌దత్ అభినందించారు.
యువకుల వద్ద గంజాయి స్వాధీనం
కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై ఓ దాబా సమీపాన ఇద్దరు యువకుల వద్ద 30గ్రాముల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా దాబా సమీపాన ఖాళీ స్థలంలో వాల్యాతండాకు చెందిన బానోత్ అరవింద్, వడిత్య నవీన్ పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా సొంతానికి ఉపయోగిస్తున్న 30 గ్రాముల గంజాయి లభించడంతో అరెస్ట్ చేశామని ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
కూసుమంచి: కూసుమంచి గ్రామానికి చెందిన వేముల సాయి(26) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 11న ఆయన మద్యం మత్తులో గడ్డి మందు తాగగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయి మృతి చెందగా, ఆయన సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
పిచ్చికుక్క దాడిలో గాయాలు
ఏన్కూరు: మండలంలోని కేసుపల్లిలో గురువారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. నలుగురు స్థానికులపైనే కాక నాలుగు పశువులను సైతం కుక్క గాయపరిచింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ముప్పుతిప్పలు పెట్టిన కుక్కను చివరకు గ్రామస్తులు చంపేశారు. అయితే గ్రామంలోని మరికొన్ని కుక్కలను ఈ పిచ్చికుక్క కరవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.