ఖమ్మం సహకారనగర్/కల్లూరు/కల్లూరురూరల్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గణిత ఉపాధ్యాయులకు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యాన ‘నేషనల్ టీచర్ ఎక్స్‌లెన్స్’ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ముదిగొండ జెడ్పీహెచ్‌ఎస్, కల్లూరు పేరువంచ జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయులు అవధానుల మురళీకృష్ణ, ఎం.డీ.మౌలానా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వీరికి ఎమ్మెల్సీ మల్కం కొమరయ్య అవార్డులు అందజేయగా కారుమంచి రఘు, పసునూరి శ్రీనివాస్, పట్నం కమలామనోహర్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ అదనపు టవర్లతో మెరుగైన సేవలు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో అవసరమైన చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటచేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సభ్యులు సమావేశమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా మెరుగైన సేవలందేలా 189టవర్ల అవసరముందని టీఏసీ కమిటీ, అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యాన ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, అమరవాడి సత్యనారాయణరెడ్డి, బానోత్ రంజిత్ నాయక్, మచ్చా రామారావు, పల్లెల రామ లక్ష్మయ్యగౌడ్, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వైభవంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్తుల జయజయధ్వానాల నడుమ ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో గిరి ప్రదక్షిణ గురువారం వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం(స్వాతి నక్షత్రం) సందర్భంగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం నుంచి తీసుకొచ్చి గుట్ట చుట్టూ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు నృసింహ నామ స్మరణ చేయగా, కోలాట బృందాలు సైతం పంచుకున్నాయి. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని తిరిగి గుట్టపైకి చేర్చి, రాతి కొండపై పండితులు నక్షత్ర జ్యోతిని వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు, అర్చకులు పాల్గొన్నారు.
జెడ్పీలో ‘స్వచ్ఛత’
ఖమ్మంగాంధీచౌక్: వచ్చేనెల 2వ తేదీ వరకు తపాలా శాఖ ఆధ్వర్యాన నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు గురువారం ఖమ్మంలోని జెడ్పీ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. తపాలా డివిజన్ కార్యాలయ ఏఎస్‌పీ మధుసూదన్ రావు, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, కాళీ హైమావతి, వివిధ పోస్టాఫీసుల పోస్టుమాస్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితిలో ‘బాగం’
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ జాతీయ సమితి సభ్యుడిగా ఖమ్మంకు చెందిన బాగం హేమంతరావు రెండోసారి ఎన్నికయ్యారు. చండీఘర్‌లో ఇటీవల జరిగిన జాతీయ మహాసభల్లో కమిటీని ఎన్నుకోగా ఆయనకు స్థానం దక్కింది.

జిల్లా ఉపాధ్యాయులకు అవార్డులు

జిల్లా ఉపాధ్యాయులకు అవార్డులు