అనేక అవస్థల నడుమ
జిల్లా రైతులకు రూ.63.63 కోట్ల బకాయి సాగుకు దన్నుగా ఉంటాయనుకుంటే నిరాశే మరో రెండు నెలల్లో మొదలుకానున్న ఖరీఫ్ కొనుగోళ్లు
బోనస్ వస్తే కలిసి వస్తుంది..
జోరుగా సన్నధాన్యం సాగు
రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ప్రకటించడంతో యాసంగిలో రైతులు అటే మొగ్గు చూపారు. సహజంగా ఈ సీజన్‌లో ఆరుతడి పంటల సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తుంటారు. రైతులు కూడా అతి తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. కానీ మద్దతు ధరకు తోడు బోనస్ వస్తుందని సన్నధాన్యాన్నే సాగు చేశారు. ఫలితంగా సాగర్ ఆయకట్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో 2,10,830 ఎకరాల్లో వరి సాగు చేస్తే అందులో 1,29,064 ఎకరాల్లో సన్నరకాలే సాగయ్యాయి.
18,893 మంది రైతుల నుంచి సేకరణ
యాసంగి సీజన్‌లో సన్న, దొడ్డు రకాలు కలిపి 54,51,516 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోగా 25,84,928 క్వింటాళ్ల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు ఉన్నాయి. అయితే 18,893 మంది రైతుల నుంచి 12,70,653.60 క్వింటాళ్ల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరించింది.
రూ.63.63 కోట్లు బకాయి
యాసంగిలో సన్నరకం ధాన్యం సాగు చేయడం ఒక ఎత్తయితే.. ఆ ధాన్యాన్ని విక్రయించడం మరో సమస్యగా మారింది. అయినా మద్దతు ధరకు తోడు క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందని రైతులు భరించారు. అమ్మకం పూర్తికాగానే బోనస్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ రాకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి 18,893 మంది రైతులకు రూ.63,63,57,600 బోనస్ అందాల్సి ఉంది. ప్రస్తుతం వానాకలం పంటల సీజన్ కొసాగుతుండడంతో పెట్టుబడికి ఉపయోగపడుతుందనుకున్న బోనస్ రాకపోవడం గమనార్హం. మరో రెండు నెలల్లో ఈ వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోళ్లు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యాన యాసంగి సీజన్ బోనస్ చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయానికి రైతులు అనేక అవస్థలు పడ్డారు. ధాన్యం కాంటాలు సమయానికి జరగక కేంద్రాల్లో రోజుల తరబడి ఉండాల్సి వచ్చింది. తేమ శాతం పేరుతో మిల్లర్లు క్వింటాకు 3 – 5 కేజీల తరుగు తీశారు. మరోవైపు లోడింగ్ కోసం లారీలు రాక ఇబ్బంది పడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే ఆరబెడుతూ కాలం గడిపారు. ఇన్ని అవాంతరాల నడుమ ధాన్యం అమ్మినా బోనస్ రాక ఆవేదన చెందుతున్నారు.
ధాన్యం బోనస్ కోసం రైతుల ఎదురుచూపులు
యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యాన్ని నేలకొండపల్లి కేంద్రంలో విక్రయించా. 50 క్వింటాళ్ల ధాన్యం అమ్మితే బోనస్ వెంటనే వస్తుందని చెప్పారు. వానాకాలం సాగు ఖర్చులకు బోనస్ ఉపయోగపడుతుందనుకున్నా. కానీ ఇప్పటికీ అందలేదు. బోనస్ కోసంఽ అధికారులను అడిగితే ఏమీ చెప్పడం లేదు. ఇకనైనా చెల్లిస్తే ఖర్చులకు కలిసొస్తుంది.
– పోలంపల్లి జాన్, భైరవునిపల్లి,
నేలకొండపల్లి మండలం