
16 పోస్టులు.. 200మంది అభ్యర్థులు
కల్లూరు: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రాథమిక విద్య బోధించేలా పలు పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా పలు వురు దరఖాస్తు చేసుకున్నారు. ఈనేపథ్యాన కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం తల్లాడ, ఏన్కూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాలుగు మండలాల్లో కలిపి ఎనిమిది మంది ఇన్‌స్ట్రక్టర్లు, ఎనిమిది మంది ఆయాలను నియమించనుండగా.. ఇంటర్వ్యూలకు 200మందికి పైగా హాజరయ్యారు. సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, తహసీల్దార్లు, కరుణాకర్‌రెడ్డి, శేషగిరిరావు, శ్రీనివాసరావు, ఎంఈ ఓలు దామోదర ప్రసాద్, పత్తిపాటి నివేదిత వీరి విద్యార్హతలు, ఇతర అంశాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా, పెద్దసంఖ్యలో అభ్యర్థులు రావడం.. కార్యాలయంలో సరైన సౌకర్యాలు ఏర్పా టు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక కార్యాలయ ఆవరణలోని చెట్ల కింద సేద తీరడం కనిపించింది.