
‘క్రిప్టో కరెన్సీ’ కలకలం
● నకిలీ అకౌంట్లతో లావాదేవీలు? ● జిల్లాలోని పలువురి పేరిట వ్యవహారం
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలో ‘క్రిప్టో’ కరెన్సీ వ్యవహారం కలకలం రేపుతోంది. పలువురి పాన్ కార్డులను ఉపయోగించి నకిలీ అకౌంట్లతో కొందరు లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యవహారం చర్చనీయాంశమైది. రైతులు, కూలీలు, డెలివరీ బాయ్స్ పేరిట రూ.కోట్లలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్, సిద్దిపేట, జగిత్యాలతో పాటు జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి ఈ వ్యవహారం చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఖమ్మంకు చెంది ఓ ఫార్మా ఉద్యోగి, సత్తుపల్లిలో రైతు పేరిట రూ.50 కోట్ల వరకు లావాదేవీలు నడిచాయని చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయ పన్ను శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించగా.. ఖమ్మం ఆదాయ పన్నుల శాఖ అధికారులు మాత్రం తమకెలాంటి సమాచారం లేదని వెల్లడించారు. పన్ను చెల్లింపుల్లో మోసాలకు పాల్పడితేనే గుర్తించే అవకాశముందని ఓ ఐటీ అధికారి తెలిపారు.
క్రిప్టో కరెన్సీ అంటే...
ప్రభుత్వం లేదా బ్యాంకు నియంత్రణ లేకుండా కంప్యూటర్ నెట్‌వర్క్ ద్వారా కొనసాగే డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ టోకెన్లను క్రిప్టో కరెన్సీగా వ్యవహరిస్తారు. ఇది ఆన్‌లైన్‌లో వ్యక్తుల(పీర్–టు–పీర్) మధ్య నేరుగా చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ కరెన్సీ విలువ మార్కెట్ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. 1990 నుంచి దీని మూలాలు ఉన్నప్పటికీ రహస్యంగా సాగాయి. ఆపై బిట్ కాయిన్ వెలుగులోకి వచ్చింది. వాడుక భాషలో కొందరు దీన్ని వర్చువల్ కరెన్సీగా కూడా పిలుస్తారు. 2018లోనే క్రిప్టోకరెన్సీపై రిజర్వ్‌బ్యాంకు నిషేధం విధించగా.. పలు ఏజెన్సీలు వేసిన కేసు ఆధారంగా సుప్రీంకోర్టు 2020 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నేపథ్యాన లావాదేవీలు విస్తరిస్తుండగా.. నకిలీ అకౌంట్లలో లావాదేవీలు జరిగినట్లు మొదలైన ప్రచారం జిల్లాలో కలకలం రేపుతోంది.