
లంక భూముల సర్వే వాయిదా
చింతకాని: చింతకాని మండలం చిన్నమండవ మున్నేటిలో ఉన్న ముదిగొండ మండలం గంగాపురం రెవెన్యూ పరిధి లంక భూముల సర్వే మరోమారు వాయిదా పడింది. సుమారు 67ఎకరాలకు పైగా లంక భూములకు కొందరు పట్టా చేయించుకుని రైతు భరోసా నిధులు పొందుతుండమే కాక ఇసుక తరలిస్తున్న వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్న విషయం ఇటీవల వెలుగు చూసింది. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కాగా.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యాన సర్వే చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. తొలుత సోమవారం సర్వే చేయాలని భావించినా డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ఉండడంతో వాయిదా పడింది. ఇక మంగళవారం మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మున్నేటి వద్దకు చేరుకోగా అప్పటికే వరద పెరిగి లంక భూముల్లోకి వెళ్లడం సాధ్యం కాక వెనుదిరిగారు. అయితే, గంగాపురం రెవెన్యూ పరిధి 123 నుంచి 126వ సర్వే నంబర్లలో లంక భూములకు పొందిన పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించినట్లు సమాచా రం. సర్వే కోసంవచ్చిన వారిలో డీఐ ధర్మారావు, మైనింగ్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, సర్వేయర్లు శాంతాకుమారి, ఉమామహేష్, నవీన్, ఇరిగేషన్ ఏఈ మహేష్, ఆర్‌ఐలు ఏకవీర, ప్రసన్న, గ్రామ రెవెన్యూ అధికారి ఉప్పలి తదితరులు ఉన్నారు.
మున్నేటి వరద పెరగడంతో
వెనుదిరిగిన అధికారులు