
ఆగలేదు.. ఆపారంతే!
● ఏపీ నుంచి మళ్లీ మొదలైన ఇసుక దందా ● సత్తుపల్లి మీదుగా హైదరాబాద్‌కు రవాణా ● ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టని యంత్రాంగం
సత్తుపల్లి: ‘ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోండి.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి కట్టడి చేయాలి.. మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటల పాటు సిబ్బంది పహారా కాయాలి..’ అంటూ ఇటీవల పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఈ ఆదేశాలపై జిల్లా అధికారులకు ఏ మేర శ్రద్ధ పెట్టారో, లేదో తెలియదు కానీ ఏపీలో మాత్రం అక్కడి అధికారులు ఇసుక లారీలను సీజ్ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు ఆ రాష్ట్రం నుంచి ఇసుక రవాణా నిలిచిపోగా... మళ్లీ అంతా సద్దుమణగగానే తాజాగా మొదలైంది. రెండు రోజుల క్రితం ఇసుక లారీలను ఏపీ పోలీసులు మైనింగ్ శాఖకు అప్పగించి చేతులు దులుపుకోవడంతో అక్రమార్కులు మళ్లీ రవాణా మొదలుపెట్టగా సత్తుపల్లి రహదారులపై టిప్పర్లు, లారీలు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి.
సరిహద్దు దాగుడుమూతలు
ఏపీ నుంచి సోమవారం అర్ధరాత్రి రెండు లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో సత్తుపల్లి పోలీసులు బుగ్గపాడు మీదుగా నాగుపల్లి వరకు వెళ్లారు. అక్కడ రెండు లారీలు కనిపించగా సీజ్ చేసేందుకు యత్నిస్తుండగా ఆ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి పరిధిలోకి వస్తుందని తేలింది. దీంతో దమ్మపేట పోలీసులను పిలిచి అప్పగించారు. కాగా, అక్కడ చాలాసేపు హైడ్రామా నడిచినట్లు సమాచారం.
అటు వెళ్లగానే...
ఓ వైపు సత్తుపల్లి పోలీసులు ఇసుక లారీలను పట్టుకునేందుకు పక్క మండలానికి వెళ్లగా.. అదే సమయంలో ఏపీ నుంచి ఇసుకతో వచ్చిన ఐదారు లారీలు వెళ్లినట్లు సమాచారం. అయితే, పోలీసులను కొందరు పక్కదోవ పట్టించేందుకు ఈ తరహా ప్రయత్నం చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ నుంచి సత్తుపల్లి మీదుగా హైదరాబాద్‌కు నిత్యం పదుల సంఖ్యలో ఇసుక లారీలు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్తుండడం జిల్లాలో తనిఖీల పరిస్థితిని తెలియచేస్తోంది.
నష్టం లేకుండానే..
కాగా, ఇసుక లారీలను పట్టుకున్నప్పుడు మైనింగ్ శాఖకు అప్పగిస్తే లారీ యజమానులు ఊరటగానే భావిస్తారని సమాచారం. మైనింగ్‌శాఖ మొదటిసారి పట్టుకున్నప్పుడు టన్నుకు రూ.1,200 చొప్పున జరిమానా విధించి అది చెల్లిస్తే ఇసుక సహా లారీలు ఇచ్చేస్తారు. దీంతో ఆ ఇసుకను మంచి ధర ఉన్న చోటకు తీసుకెళ్లి అమ్మితే యజమానులకు ఎలాంటి నష్టముండదు. సత్తుపల్లిలో టన్ను ఇసుక ధర రూ.1,100 ఉంటే ఖమ్మంలో రూ.1,500గా, హైదరాబాద్‌లో రూ.3వేల వరకు వస్తుండడంతో లారీని పట్టుకోగానే మైనింగ్‌శాఖకు అప్పగించాలని లారీ యజమానులే కోరుతుంటారట! రెండో సారి కూడా అదే స్థాయిలో జరిమానా విధించనుండగా.. మూడో సారి పట్టుబడితే మాత్రం జరిమానా రెండింతలు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తారు.
టన్నుల మాయాజాలం
ఇసుక అక్రమ రవాణా చేసే లారీల బాధ్యులు కాంటా రెండు విధాలుగా చూపిస్తున్నారని సమాచా రం. ఒక్కో లారీకి 20 టన్నులు, పెద్ద లారీలైతే 30 టన్నులు వే బ్రిడ్జి బిల్లుతో తీసుకెళ్తుంటే పట్టుబడినప్పుడు అంత మొత్తానికే జరిమానా విధిస్తారు. వాస్తవానికి ఒక్కో 20 టన్నుల లారీలో 40 టన్నులు, 30 టన్నుల లారీల్లో 60 – 70 టన్నుల ఇసుక రవాణాకు అవకాశముంటుందని చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఇసుక రీచ్‌ల రశీదు, వే బ్రిడ్జి బిల్లునే ప్రామాణికంగా తీసుకుంటుండడంతో యజమానులు పెద్దగా నష్టం లేకుండానే బయటుపడుతున్నారని సమాచారం. కాగా, సోమవారం రాత్రి దమ్మపేటలో రెండు లారీలు పట్టుబడగా ఒక్కో లారీలో 20 టన్నుల ఇసుక ఉన్నట్లు కేసు నమోదు చేశారు.