
నేరం జరిగిన వెంటనే చేరేలా...
● అందుబాటులోకి ఫోరెన్సిక్ ల్యాబ్ వ్యాన్ ● ప్రారంభించిన సీపీ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: నేరం జరిగే ప్రదేశంలో సాక్ష్యాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాక నివేదిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఎక్కడికక్కడ సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ కోసం అత్యాధునిక పరికరాలతో కూడిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మొబైల్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాబ్‌ను పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి నిందితుల వేలిముద్రలు, రక్తపు నమూనాలు, ఇతర ఆధారాలను సేకరించడమే కాక విశ్లేషించేందుకు ఈ మొబైల్ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఏఆర్ ఏసీపీ సుశీల్‌సింగ్, వైద్యులు నాగలక్ష్మి, సుధాకర్, అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహ, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
వేగంగా కేసుల విచారణ
మాదకద్రవ్యాలు, పోక్సో కేసుల్లో విచారణ వేగంగా చేపట్టడమే కాక రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల నమోదు విచారణ, చార్జీషీట్ల దాఖలుపై సమీక్షించారు. వైరా, కల్లూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నేరాల నియంత్రణ, చోరీ సొత్తు రికవరీ కోసం స్టేషన్ల వారీగా ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, జూదం, బెట్టింగ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటుపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీసీ ఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ స్వామి, ఎస్సైలు రవి, సత్యనారాయణ పాల్గొన్నారు.