
పెద్దాస్పత్రి కిటకిట..
జిల్లాలో 30 డెంగీ కేసులు..
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరిగింది. ముఖ్యంగా డెంగీ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల తల్లాడ, తిరుమలాయపాలెం మండలాల్లో ఎక్కువగా కేసులు వెలుగులోకి వచ్చాయి. సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నా.. వ్యాధుల వ్యాప్తి మాత్రం పెరుగుతూనే ఉంది. ఆ శాఖ అధికారులు చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేలో ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. డెంగీతో పాటు విషజ్వరాల ప్రభావం అధికంగా ఉన్నట్లు సమాచారం.
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఇటీవల పేషెంట్ల తాకిడి పెరిగింది. ముఖ్యంగా డెంగీ, విష జ్వరాలతో ఎక్కువ మంది వస్తున్నారు. అంతేకాక ఇతర వ్యాధుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉండడంతో వార్డులన్నీ బాధితులతో నిండిపోయాయి. ఇక్కడ గత పది రోజులుగా సగటున నిత్యం 1100 నుంచి 1200 మంది వరకు వైద్య సేవల కోసం వస్తున్నారు. గత పది రోజుల్లో 11,165 మంది ఓపీ వైద్య సేవలు పొందగా, 922 మంది ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు జ్వరాల ప్రభావంతో ఆస్పత్రికి ఎక్కువగా వస్తున్నారు. పెద్దాస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు డెంగీ పాజిటివ్ రోగులు చికిత్స పొందుతుండగా, వైరల్ జ్వరాల బారిన పడి వందలాది మంది చికిత్స తీసుకుంటున్నారు.
లెక్క తేలని ‘ప్రైవేట్’..
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో గత 10 రోజులుగా జ్వరాలతో చేరే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే జ్వర కేసుల వివరాలు తెలియడం లేదు. కేసుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, సమాచారం ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినా ప్రైవేటు యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఏరోజుకారోజు వివరాలు అందజేస్తే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ జ్వర కేసులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి, అక్కడ ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రైవేటు ఆస్పత్రుల వారు లెక్కలు చెప్పకపోవడంతో జాగ్రత్త చర్యలు లేక వ్యాధులు తీవ్రమవుతున్నాయని తెలుస్తోంది. కాగా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. డెంగీ కారక దోమ ఇంటి పరిసరాల్లోనే జీవిస్తుందని, ఇంటి పరిసరాల్లో పాత వస్తువులు నిల్వ ఉంచకుండా తొలగించాలని అంటున్నారు. లేదంటే వాటిలో గుడ్డు పొదిగి లార్వా వృద్ధి చెంది డెంగీ కారక దోమలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు.
సీజనల్ వ్యాధులతో వస్తున్న బాధితులు
డెంగీ, విషజ్వరాలతో చేరుతున్న జిల్లా వాసులు
రోజుకు 1000కి పైగా ఓపీ కేసులు
గత పది రోజులుగా పెద్దాస్పత్రిలో ఓపీ, ఐపీ సేవలు
తేదీ ఔట్ పేషెంట్ ఇన్ పేషెంట్
24 (జూలై) 1,128 59
25 1,083 105
26 1,330 85
27 (ఆదివారం) 00 35
28 1,606 119
29 1,452 109
30 1,385 110
31 839 82
01 (ఆగస్టు) 1,230 119
02 1,112 59

పెద్దాస్పత్రి కిటకిట..