
ఇక్కడి నుంచే రాజకీయ మార్పునకు పునాది
ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఖమ్మం కేంద్రబిందువుగా మారిందని, ఇక్కడే రాజకీయ మార్పునకు పునాది పడనుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో సోమవారం ‘మహా సంపర్క్ అభియాన్’ పేరిట పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఆతర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీకి శక్తిని అందించనుందని తెలి పారు. జిల్లాలో రాజకీయ వాతావరణం మారుతూ, ప్రజలంతా మార్పు వైపు మొగ్గు చూపుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా బూత్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌లో కుటుంబ కలహాలతో అలజడి నెలకొనగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో శూన్యతను ప్రజలు గుర్తించారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు దేవకీ వాసుదేవరావు, ఈ.వీ.రమేష్, నున్న రవికుమార్, పుల్లారావు యాదవ్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, అల్లిక అంజయ్య, జ్వాలా నర్సింహారావు, గడిల నరేష్, ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి