
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
కొణిజర్ల: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కారు నడుపుతున్న యువకుడు మృతి చెందిన ఘటన కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపాన ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. వైరాకు చెందిన రాయల కల్యాణ్(19) కొణిజర్ల మండలం చిన్నమునగాలలో అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటూ పల్లిపాడు సమీపాన కారు గ్యారేజ్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఆయన గ్యారేజ్ నుంచి కారులో పల్లిపాడు వైపు వెళ్తుండగా రైస్ మిల్లు సమీపాన భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవడంతో తీవ్రంగా గాయపడిన కల్యాణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కల్యాణ్ తాత తిగుళ్ల కోటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.సూరజ్ తెలిపారు. కాగా, ఎదురెదురుగా ఢీకొన్న కారు, బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ఖమ్మం – వైరా రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు బస్సును జేసీబీ సాయంతో వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ
● భద్రాద్రి జిల్లా వాసి మృతి
కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్‌ఐ జి.సూరజ్ వెల్లడించిన వివరాలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడి గుండాలకు చెందిన ముక్తి భూపతి(38) ఓ ప్రైవేట్ బీమా కంపెనీలో పనిచేస్తున్నాడు. వైరాలో మార్కెటింగ్ ఏజెంట్ల శిక్షణ సోమవారం జరగగా ఆయన హాజరై తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపాన ఆయన బైక్‌ను వెనక నుంచి కంటైనర్ లారీ ఢీకొట్టడమే కాక టైరు భూపతి పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలై ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. భూపతి సోదరుడు విజయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.