
అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం
చింతకాని: మండలంలోని నాగులవంచ రెడ్డిచెరువులో గల్లంతైన అన్నదమ్ములు మత్స్యకారులు కంభం నాగేశ్వరరావు(62), సత్యం(58) మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. గత 35ఏళ్లుగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులుగా కొనసాగుతున్న వారికి ఈత కొట్టడంలో నైపుణ్యం ఉన్నా చెరువులో మునిగి మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... మత్స్యకారుడైన కంభం నాగేశ్వరరావు గ్రామంలోని రెడ్డిచెరువును ఏటా రూ.4లక్షల చొప్పున సభ్యులకు చెల్లించేలా రెండేళ్ల కాలానికి లీజ్ తీసుకుని చేపల పెంచుతున్నాడు. రోజులాగే ఆయన ఆదివారం మధ్యాహ్నం తన తమ్ముడు సత్యంతో కలిసి ద్విచక్ర వాహనంపై చెరువు వద్దకు వెళ్లారు. కట్టపై ద్విచక్ర వాహనం పెట్టి అక్కడే బట్టలు, చెప్పులు విడిచి చెరువులోకి దిగిన అన్నదమ్ములు గల్లంతయ్యారు. రాత్రి వరకు వారు రాకపోవడం, సెల్‌ఫోన్లు స్విచాఫ్ ఉండడంతో కుటుంబీకులు పరిశీలించగా కట్టపై బైక్, దుస్తులు, చెప్పులు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై నాగుల్‌మీరా ఆధ్వర్యాన గాలించినా ఆచూకీ తెలియరాక చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. తిరిగి సోమవారం ఉదయం గాలిస్తుండగా పాతర్లపాడు చెరువు నుంచి నీళ్లు రెడ్డి చెరువులో కలిసే ప్రాంతంలో నాగేశ్వరరావు, సత్యం మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, గాలింపు చర్యలను వైరా సీఐ సాగర్ పర్యవేక్షించారు. కాగా, ఒకే ఘటనలో అన్నదమ్ములిద్దరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్థికపరమైన విబేధాలు
నాగేశ్వరరావు, సత్యం మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. రెడ్డి చెరువును నాగేశ్వరరావు సంఘ సభ్యులందరి సమ్మతితో లీజ్‌కు తీసుకోగా, సంఘంలో సభ్యుల మధ్య విభేదాల కారణంగా ముగ్గురు వ్యతిరేకించారు. దీంతో ఆ ముగ్గురు చెరువులో నాగేశ్వరరావు అమర్చిన వలలు తొలగించేందుకు ఆదివారం ఉదయం మరో ముగ్గురితో కలిసి వెళ్లినట్లు సమాచారం. ఈమేరకు నాగేశ్వరరావు, సత్యం వెళ్లడం ఆ తర్వాత గల్లంతవడంతో ఆరుగురిపైనే అనుమానం ఉందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అన్నదమ్ముల మృతిపై నాగేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
ఘటనపై అనుమానాలతో
కుటుంబీకుల ఫిర్యాదు

అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం