
ఇన్‌చార్జ్ డీఈఓగా నాగపద్మజ
ఖమ్మం సహకారనగర్: జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ ఇన్‌చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులయ్యారు. ఈమేరకు కలెక్టర్ అనుదీప్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లు డీఈఓగా కొనసాగిన సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండడంతో నాగపద్మజను ఇన్‌చార్జ్ డీఈఓగా నియమించారు.
జీపీల పెండింగ్ బిల్లులపై ఆరా
నేలకొండపల్లి: గ్రామపంచాయతీల్లో గత పాలకవర్గాలు చేపట్టిన పనుల పెండింగ్ బిల్లుల వివరాలు సమర్పించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఐదేళ్లలో చేసిన పనులు, ఎం.బీ. రికార్డులు, రికార్డులు లేకుండా పనులు, వాటి బిల్లులు సమర్పించడమే కాక పాలకవర్గాలు తీర్మానాలు ఉంటే ఆ జిరాక్స్‌లు జత చేసి పంపాలని జిల్లా పంచాయతీ అధికారులు కార్యదర్శులను ఆదేశించారు. దీంతో సోమవారం జిల్లాలోని అన్ని జీపీల కార్యదర్శులు పెండింగ్ బిల్లులు సిద్ధం చేయడం మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకే వివరాలు ఆరా తీస్తోందన్న ప్రచా రంతో మాజీ సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలోని ప్రతీ జీపీకి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం.