దొడ్డబళ్లాపురం: రెండు నెలల క్రితం బెయిలుపై విడుదలై వచ్చిన అమిత్ (27) అనే యువకున్ని అతని తల్లెదుటే దుండగులు హతమార్చిన ఘటన దావణగెరె జిల్లా హొన్నాళి పట్టణంలోని దుర్గగుడి ప్రాంతంలో జరిగింది. అమిత్ హొన్నాళి పురపాలక సంఘంలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతంలో గణేశ్ అనే వ్యక్తిపై అమిత్ కత్తితో దాడిచేసి గాయపరిచాడు. ఆ కేసులో అమిత్ జైలుకు వెళ్లి విడుదలయ్యాడు. అప్పటి నుంచి నిన్ను చంపేస్తానని గణేశ్ బెదిరించేవాడు. మంగళవారం రాత్రి అమిత్ తల్లితో కలిసి మహాంకాళి దేవాలయానికి వచ్చిన సమయంలో దుండగులు అతనిపై దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లి కత్తులతో నరికి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ అమిత్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. గణేశ్, అతని అనుచరులే హత్య చేశారని అమిత్ తల్లి గుర్తించింది. తనయుని హత్యతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. హొన్నాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్యారక్ బదిలీకి పవిత్ర అర్జీ
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో ఉన్న మొదటి నిందితురాలు, నటి పవిత్రగౌడ మళ్లీ తన బ్యారక్‌ను బదిలీ చేయాలని కోర్టులో అర్జీ దాఖలు చేసింది. తాను ఉన్న బ్యారక్‌లో 30 మంది విచారణ ఖైదీలు ఉన్నారని, రద్దీ వల్ల నిద్రపట్టడం లేదని, కాబట్టి మరో బ్యారక్ కేటాయించాలని అర్జీలో కోరింది. విదేశీ ఖైదీలు రోజూ వేధిస్తున్నారని, ప్రశాంతత కరువైందని, జైలు అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపింది. సురక్షితంగా ఉన్న బ్యారక్‌కు మార్చేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరింది. గతంలో కూడా ఇలాంటి సమస్యలతో ఆమె బ్యారక్ మారడం తెలిసిందే.
నేటి నుంచి భారీ వర్షసూచన
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో గురువారం నుంచి 3 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మలెనాడు, కరావళి ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. బెంగళూరు సిటీ, గ్రామీణ, పరిసర జిల్లాల్లోనూ వర్షాలకు ఆస్కారముంది. కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవాలని వ్యవసాయశాఖ తెలిపింది.
మెట్రోలో ‘హృదయ’ రవాణా
సాక్షి బెంగళూరు: నమ్మ మెట్రో రైలులో గుండెను విజయవంతంగా తరలించారు. యశవంతపురలోని ప్రైవేటు ఆస్పత్రి నుంచి బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి శేషాద్రిపురంలోని అపోలో ఆస్పత్రికి 18 నిమిషాల్లో హృదయాన్ని తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 2:22 గంటలకు గోరగుంటపాళ్య మెట్రో రైల్వే స్టేషన్ నుంచి వైద్యసిబ్బంది గుండెతో బయల్దేరి సంపిగే రోడ్డు మెట్రో రైల్వే స్టేషన్‌కు 2.40 గంటలకు చేరుకున్నారు. ట్రాఫిక్ రద్దీని తప్పించేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు.
రైలు బోగీలు ఆహుతి
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో రాజానుకుంట రైల్వే యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న మూడు రైలు బోగీలలో మంటలు రేగి ఆహుతయ్యాయి. బుదవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఓ బోగీలో మంటలు పుట్టాయి. రైల్వే సిబ్బంది అప్పుడప్పుడు మాక్ డ్రిల్ కోసం ఉపయోగిస్తున్న ఈ మూడు పెట్టెలు కొన్ని రోజులుగా ఇక్కడే నిలిపి ఉన్నాయి. వరుసగా మంటలు వ్యాపించి దగ్ధం కావడంతో భారీగా జనం పోగయ్యారు. రైల్వే అధికారులు, పోలీసులు పరిశీలించారు. మంటలు అదుపులోకి వచ్చే వరకూ ఆ మార్గంలో రైళ్ల సంచారాన్ని బంద్ చేశారు.


