మా నాన్నపై కుట్ర
● మంత్రి యతీంద్ర ఆవేదన
శివాజీనగర: రాష్ట్రంలో కరువు, తాగునీటి కొరత నీటి సమస్యలు, చెరకు రైతుల కష్టాలు ప్రధానంగా ఉండాల్సిన తరుణంలో స్టింగ్ ఆపరేషన్, సీడీ కల్చర్ వంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి అని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి విమర్శించారు. మంగళవారం బెంగళూరులో పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ తాజా రాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. సీఎం డీకే శివకుమార్ సదాశివనగరలోని ఒక ఇంట్లో నలుగురు రిటైర్డ్ పోలీసు అధికారులను నియమించి అత్యాధునిక పరికరాలను అమర్చారు, వారు మంత్రులపై సమాచార సేకరణ, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు, ఆఖరికి నా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని టీవీ షోలు చూస్తే, ఎవరెవరిపై నిఘా పెట్టారో మీకే తెలుస్తుంది. ఇలాంటి ఉచ్చులు పన్నడానికి ఒక ప్రత్యేక బృందం పనిచేస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో స్టింగ్ ఆపరేషన్ అనే విషపు చెట్టుకు డీకే శివకుమార్ నీళ్లు పోశారు. ఆయన నాటిన మొక్కలు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దాని ఫలాలను ఆయనే తినాల్సి వస్తోంది అన్నారు. రమేష్ జార్కిహొళి కేసులో మీరేం చేశారు? కే.ఎన్.రాజణ్ణ ఎందుకు నోరు మూసుకున్నారు, ఇప్పుడు సిద్దరామయ్య సైతం కోర్టుకు స్టే కోసం ఎందుకెళ్లారు?, ఇదేనా మీ ఘనత అని సీఎం డీకేపై విమర్శలు సంధించారు. లోక్‌సభ ఎన్నికలప్పుడు హాసన్‌లో పెన్‌డ్రైవ్‌లను పంపిణీ చేశారు, వాటిని సదాశివనగనరలోని ఇంట్లోనే తయారు చేశారని ఆరోపించారు. సిద్దరామయ్య బాధ నాకు అర్థమవుతోంది. మిమ్మల్ని ఏ స్థాయికి దిగజార్చారో చూడండి. కానీ మీరు పోరాడండి అని చెప్పారు.
మా ఎమ్మెల్యేలను పిలుచుకెళ్లు
● విజయేంద్రకు సీఎం డీకే సవాల్
శివాజీనగర/ బనశంకరి: 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమా? అయితే వారందరినీ ఇప్పుడే పిలుచుకెళ్లండి అని బీజేపీ నేత విజయేంద్రకు సీఎం డీకే శివకుమార్ వ్యంగ్యంగా సవాల్ చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కర్ణాటక భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమని విజయేంద్ర చెప్పడంపై డీకే మండిపడ్డారు. పార్టీలోకి చేర్చుకుని బీజేపీని బలోపేతం చేసుకోవాలని సీఎం సూచించారు. గత రాజ్యసభ ఎన్నికలలో బీజేపీలో క్రాస్ ఓటింగ్ జరిగితే ఎవరు అలా చేశారో కుమారస్వామి గానీ, విజయేంద్ర గానీ చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.
కుమారస్వామి ఆరోపణలపై
కుమారస్వామి ఓ మంచి అంశంతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించారు, అన్ని ఆరోపణలకు కాలమే సమాధానమిస్తుందని సీఎం డీకే వ్యంగ్యమాడారు. స్టింగ్ ఆపరేషన్ ఆరోపణలను, ఫోన్ ట్యాపింగ్‌ను విలేకరులు ప్రస్తావించగా అది విని నేను చాలా సంతోషపడ్డానని అన్నారు. కుమార చెబుతున్న ఫైళ్లను ఆయనకే ఇస్తానన్నారు.
సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం
సిద్దరామయ్య (ఫైల్)
కుమారస్వామి
రాష్ట్రంలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకున్ని కదిపినా స్టింగ్ ఆపరేషన్ అనేదే వినిపిస్తోంది. మాజీ సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా ఆపరేషన్ సాగిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి బాధ్యులు మీరేనని నాయకులు ఆరోపణల ఆటను ముమ్మరం చేశారు. మరోవైపు విజయేంద్ర చేసిన ప్రకటనపై సీఎం డీకే శివకుమార్ ఆగ్రహానికి లోనయ్యారు. మా పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తామంటే ఇప్పుడే తీసుకెళ్లి మీ పార్టీని బలోపేతం చేసుకోవాలని సలహా ఇచ్చారు. కన్నడనాట రాజకీయాలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి.
కోర్టుకెళ్లిన సిద్దరామయ్య
పరస్పర విమర్శల జోరు
సీఎం డీకేపై కేంద్రమంత్రి
కుమారస్వామి ధ్వజం
రాజకీయాల్లో ప్రకంపనలు
దొడ్డబళ్లాపురం: స్టింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తాజా మాజీ సీఎం సిద్దరామయ్య కోర్టును ఆశ్రయించారు. తనపై ఆధారం లేకుండా యూట్యూబ్ చానల్లలో ప్రసారం చేస్తున్న అభ్యంతరకర వీడియోలను తక్షణం నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన 50 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితానికి విఘాతం కలిగేలా అబద్ధపు వీడియోలను ప్రసారం చేస్తున్న అనేక యూట్యూబ్ చానళ్లతోపాటు 42 టీవీ చానళ్లు, సోషల్ మీడియాలను అడ్డుకోవాలని కోరారు. 2011లో జరిగినదిగా చెప్పబడుతున్న సంఘటన తాలూకు వీడియోను 15 ఏళ్ల తరువాత రాజకీయ కుట్రలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్నారని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తీర్పును రిజర్వు చేసింది.
సిద్దుకు హస్తం ద్రోహం: అశోక్
బీజేపీ పక్ష నేత అశోక్ మాట్లాడుతూ మాజీ సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీ యూజ్ అండ్ త్రోగా వాడుకుని ద్రోహం చేసిందని అన్నారు. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన సిద్ధరామయ్యను ఆ పార్టీ కోర్టు మెట్లు ఎక్కేలా చేసిందన్నారు. సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో తిరుగుతూ హైకమాండ్‌కు గులాముగా మారారు, కరువు వేళ దసరా ఉత్సవాలను అట్టహాసంగా చేయడం బాధాకరం, డీకే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండబోదు అని మండిపడ్డారు.
మైసూరు: మా నాన్న, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రతిష్టను దెబ్బతీసేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ ప్రచారాన్ని చూస్తూ మేము మౌనంగా ఉండలేము అని జిల్లా మంత్రి డా.యతీంద్ర చెప్పారు. తాజా పరిణామాలపై మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, తమ తండ్రిపై ఇన్‌స్టాలో ప్రచారంలో ఉన్న వీడియో అవాస్తవమని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలన్నది మా నాన్న అభిప్రాయమన్నారు. వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే సిద్ధరామయ్య కుటుంబంతో చర్చించారన్నారు. అలాంటి వీడియో ప్రసారం చేయకుండా కోర్టు ఉత్తర్వులను కోరినట్లు తెలిపారు. సిద్ధరామయ్య లాంటి పెద్ద నాయకుడు కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తోంది, రాజకీయాల్లో ఇలాంటిది తప్పదు అని అన్నారు. నేను, మా అమ్మ మైసూరులో ఉన్నందున మా నాన్న ఇక్కడికే వచ్చారు. ఆయన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారో లేదో నాకు తెలియదు అని చెప్పారు.


