శివాజీనగర: రాష్ట్ర నూతన గవర్నర్గా సుధా యాదవ్ నియమితులయ్యారు. ఆమె హరియానా రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీగా పేరుపొందారు. రేవారి జిల్లా, మోట్లా కలాన్ గ్రామంలో జన్మించిన సుధా యాదవ్ (60), ఐఐటీ–రూర్కీ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ, తరువాత పీహెచ్డీని పూర్తి చేశారు. ఆమె భర్త, బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అయిన సుఖ్బీర్సింగ్ యాదవ్, 1999లో కార్గిల్ యుద్ధంలో అమరులయ్యారు. సుధా యాదవ్ అప్పట్లో నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో బీజేపీలో చేరి రాజకీయాల్లో రాణించారు. 1999లో మహేంద్రగడ్ నుంచి తొలిసారి పోటీ చేసి, ప్రముఖ నేతగా పేరున్న రావు ఇందర్జిత్ సింగ్ను సుమారు 1.39 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఆమె 2004 వరకు ఎంపీగా పనిచేశారు. ఆ తరువాత 2019 నుంచి 2022 వరకు జాతీయ బీసీ కమిషన్లో సభ్యురాలిగా, తరువాత బీజేపీలో వివిధ బోర్డులలో సభ్యురాలిగా సేవలందించారు. ఇప్పుడు కన్నడనాడు గవర్నర్గా రావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
గెహ్లాట్ సామరస్య ముద్ర..
ఇప్పటివరకు గవర్నర్గా ఉన్న థావర్చంద్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వంతో సామరస్యంగా వ్యవహరించారు. కొన్ని బిల్లుల అంశాలను వెనక్కి పంపినా పెద్దగా విభేదాలు రాలేదు. ఇటీవల వందేమాతరం 2 లైన్లు చాలనే నిబంధనపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఎంలు ఎవరు ఉన్నా ఆయన తన పరిధిని కొనసాగించారు. ఆయన ఐదేళ్ల పదవీకాలం కొన్ని నెలల కిందటే పూర్తయింది. సుధా యాదవ్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు వస్తాయా? అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశముంది.


