చెరుకు రైతు కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

చెరుకు రైతు కన్నెర్ర

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పంట పండించినప్పటికీ పంట చేతికందిన తర్వాత గిట్టుబాటు ధర లేకపోవడంపై రైతన్నల ఆక్రోశం మిన్నంటింది. అందరి నోర్లు తీపి చేసే చెరుకును పండించే రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలవుతున్నామని, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొంటోందని ఆగ్రహిస్తూ రైతన్నలు చేపట్టిన నిరసన, ఆందోళన పతాకస్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా బెళగావి, ధార్వాడ జిల్లాల్లో 10కి పైగా వివిధ ప్రాంతాల్లో రైతన్నలు పెద్ద సంఖ్యలో చేరి జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. ఎటు చూసినా రైతులు పచ్చ కండువాలను ధరించి రోడ్లపైకి పెద్ద సంఖ్యలో చేరి ఆందోళనలు చేపట్టారు. ఎద్దులబండ్లతో హిరేబాగేవాడి టోల్‌గేట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి వేశారు. చెరుకు రైతుల ఆందోళనలతో రోడ్లలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. చెరుకు రైతులు చేపట్టిన ఆందోళన, నిరసన తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం చెరుకు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరపై స్పందించకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్తంభించిన వాహన రాకపోకలు

బెళగావి జిల్లా హిరేబాగేవాడి టోల్‌గేట్‌ సమీపంలో రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడి నిరసన చేపట్టడంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఎద్దులబండ్లను రహదారిపై నిలిపివేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. చెరుకు పంటకు సరైన ధర నిర్ణయించే వరకు తమ పోరాటాన్ని విరమించబోమని రైతులు స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధార్వాడ జిల్లాలో కూడా రైతు సంఘాల పిలుపు మేరకు జాతీయ రహదారిపై నిరసనలు జరిగాయి. రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలపై ప్రభావితం చేశాయి. చెరుకు సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చెరుకు టన్నుకు రూ.5000 నుంచి రూ.5500 చెల్లించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలులో ఉన్న న్యాయమైన, లాభదాయకమైన ధర చెల్లించకపోతే పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చక్కెర కనీస విక్రయ ధర పెంచడం, చెరుకు నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాల్లో రైతులకు వాటా కల్పించాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు నష్టం.. ఫ్యాక్టరీలకు లాభం

రాష్ట్రంలోని బెళగావి, బళ్లారి, రాయచూరు, ధార్వాడ, గదగ్‌, మైసూరు, మండ్య తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున చెరుకు పండిస్తున్నారని, లక్షలాది మంది రైతులు చెరుకు పండించి నష్టపోతున్నారని, రైతులకు నష్టాలు, ఫ్యాక్టరీల యజమానులకు లాభాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. జాతీయ రహదారులను దిగ్బంధం చేయడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులపై లాఠీఛార్జి చేయకూడదని ఆయా జిల్లాల ఎస్పీలు పోలీసులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని రైతుల ఆందోళనకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళన తీవ్రం కావడంతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కేశ్వాపుర ఎస్టేట్‌ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేరారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని ఒత్తిడి చేశారు.

టన్ను చెరుకుకు రూ.5500 ధర కేటాయించాలి

రాయచూరు రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన చెరుకు పంటకు టన్నుకు రూ.5500 ధర కేటాయించాలని రైతులు డిమాండ్‌ చేశారు. మంగళవారం కొప్పళ జిల్లాలోని టోల్‌గేట్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు అగ్ని దివ్యా మాట్లాడారు. విజయపుర, ధార్వాడ, కొప్పళ, బాగలకోటె జిల్లాల రైతులు కలిసి ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో రైతులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులే రహదారులను బంద్‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు స్వామినాథన్‌ నివేదికను అమలు చేయాలంటూ రాస్తారోకో జరిపారు. ఆందోళనలతో మూడు గంటల పాటు వాహనాలు, ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆందోళనలో చర్నాకోళ్లతో కొడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

రాస్తారోకోతో జాతీయ రహదారిపై స్తంభించిన వాహన రాకపోకలు

జాతీయ రహదారుల దిగ్బంధం

రోడ్లపై బైఠాయించిన రైతన్నలు

ఎద్దుల బండ్లతో వచ్చి ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement