ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తోందని రాష్ట్ర విధాన పరిషత్‌ ప్రతిపక్ష నేత చలువాది నారాయణ స్వామి ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు నుంచి ఎస్సీలకు 15 నుంచి 17 శాతం, ఎస్టీలకు 3 నుంచి 7 శాతం మేరకు కల్పించిన రిజర్వేషన్లను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ విషయంలో కోర్టుకు సరైన సమాధానం చెప్పకుండా కోర్టు నుంచి చీవాట్లు తిన్నారన్నారు. కరువు సహాయక పనుల చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్‌పీటీ, టీఎస్పీ నిధులను దళిత వర్గాలకు వ్యయం చేయకుండా పంచ గ్యారెంటీలకు వినియోగించడం తగదన్నారు. బెంగళూరులో జరగనున్న విధాన పరిషత్‌ ఎన్నికల్లో అభ్యర్థి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.

ఘనంగా మదకరి నాయక జయంతి

హొసపేటె: విజయనగర సామ్రాజ్య వీర యోధుడు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన రాజా వీర మదకరి నాయక జయంతి వేడుకలను విజయనగర జిల్లా హొసపేటెలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. హొసపేటెలో వాల్మీకి నాయక సమాజం ఆధ్వర్యంలో, అఖిల కర్ణాటక వాల్మీకి నాయక మహాసభ యువజన విభాగం ఈ జయంతిని నిర్వహించింది. వాల్మీకి నాయక సమాజానికి చెందిన గురువులు, పెద్దలు, దైవ గురువులు, యువతతో పాటు పలువురు సమాజ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని రాజా వీర మదకరి నాయక చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన వీరత్వాన్ని స్మరించుకున్నారు. వీరయోధుల చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలు, ఆదర్శాలను యువతకు తెలియజేయాలనే సందేశాన్ని ఈ జయంతి వేడుకల్లో చాటి చెప్పారు. వీర యోధుడి స్మరణతో మార్మోగిన హొసపేటెలో రాజా వీర మదకరి నాయక జయంతి వేడుకల్లో వాల్మీకి నాయక సమాజ సభ్యులు పాల్గొన్నారు.

ఒకే నంబరుతో

రెండు క్రూజర్లు

● గుర్తించిన స్థానికులు

● సీజ్‌ చేసిన అధికారులు

బళ్లారిఅర్బన్‌: నగరంలో ఒకే రిజిస్ట్రేషన్‌ నంబరుతో రెండు క్రూజర్‌ వాహనాలు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు బాలు తదితరులు గుర్తించారు. ఈ విషయంపై ఆర్టీఓ అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన బళ్లారి ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీఓ) అధికారులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఒకే రిజిస్ట్రేషన్‌ నంబరుతో రెండు వాహనాలు తిరుగుతుండటంపై అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్లు తెలిసింది.

హక్కుల సాధనకు

ఐక్యంగా పోరాడాలి

హొసపేటె: కర్ణాటకలో ఓబీసీ కులగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బీసీ రమణ డిమాండ్‌ చేశారు. మంగళవారం గంగాపరమేశ్వరి సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన ఓబీసీ కర్ణాటక రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఓబీసీల హక్కుల సాధనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం పొందేందుకు అన్ని వర్గాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలకు తగిన రిజర్వేషన్ల కల్పించాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికై న విజయనగర జిల్లా గౌరవ అధ్యక్షుడు బోంపల్లి ఈరణ్ణ, జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర బోజ, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు యాదవ్‌తో పాటు సుమారు 20 మంది ఆదేశాల పత్రాలను అందుకున్నారు. ఓబీసీ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఏ అబ్దుల్‌ ఖాదర్‌, రాష్ట్ర మహిళా కార్యదర్శి సుజాత, ఓబీసీ నాయకుడు యమునేశ్‌, రవి, గోణి బసప్ప, ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement