స్టింగ్‌ ఆపరేషన్ల ఫ్యాక్టరీ ఉంది | - | Sakshi
Sakshi News home page

స్టింగ్‌ ఆపరేషన్ల ఫ్యాక్టరీ ఉంది

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

● మాజీ మంత్రి రాజణ్ణ

శివాజీనగర: మాజీ సీఎం సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ జరిగిందని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ మంత్రి కే.ఎన్‌.రాజణ్ణ స్పందిస్తూ, సీడీలు, స్టింగ్‌ ఆపరేషన్ల కోసం ఒక ఫ్యాక్టరీ ఉందని అన్నారు. స్టింగ్‌ ఆపరేషన్‌ ప్రసారంపై సిద్దరామయ్య స్టే కోసం కోర్టుకెళ్లారన్నారు. ఇది కొత్తేమీ కాదు, గతంలో కూడా స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా సిద్దరామయ్యను రాజీనామా చేయించారనే అనుమానం రావచ్చు. దానిని కొట్టిపారేయలేం అని చెప్పారు. గతంలో తనపైనా ఇటువంటి ప్రయత్నం జరిగిందన్నారు. ఈ మొత్తం పరిణామాలను బ్లాక్‌మెయిల్‌ ఎత్తుగడగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి వద్ద అన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. వారు విచారణ జరిపి ప్రజలలో ఉన్న గందరగోళాన్ని నివృత్తి చేయాలని అని డిమాండ్‌ చేశారు. రమేష్‌ జార్కిహొళి సీడీని ఎవరు తయారు చేశారో మీరే చెప్పండి? వారే ఇప్పుడు సిద్దరామయ్య సీడీని కూడా తయారు చేశారు, దీనివల్ల కర్ణాటక పరువు, గౌరవం వేలం వేయబడుతున్నాయి. మనం మన గౌరవాన్ని కోల్పోతున్నాము. సీఎం అసహాయునిలా మాట్లాడితే ఎలా? దర్యాప్తు జరిపి అన్నింటినీ వెల్లడిస్తే స్టింగ్‌ ఆపరేషన్‌ ఇక్కడితో ఆగిపోతుందని అన్నారు.

రైతును బలిగొన్న ఏనుగు

మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హంచిపుర గ్రామంలో అడవి ఏనుగు ఓ వ్యక్తిని చంపివేసింది. వివరాలు.. గ్రామస్తుడు శివకుమార్‌ (60). తెల్లవారుజామున పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక అడవి ఏనుగు అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై అతను మరణించాడు. ఇది తెలిసి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అడవి ఏనుగుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, అటవీ శాఖ నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

చెట్టుకు పులి కళేబరం

చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని హొంగహళ్లి బీట్‌ సమీపంలో అటవీ ప్రాంతంలో ఒక చెట్టుకు చిక్కుకుని ఉన్న పులి కళేబరం లభ్యమైంది. పులి మరణానికి కారణంపై విచారిస్తున్నారు. పులి వయస్సు సుమారు 2 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అది 5 రోజుల క్రితం మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు.

చెరువులో

శవమైన యువకుడు

యశవంతపుర: ఇంటి నుంచి బయటకెళ్లిన యువకుడు చెరువులో మునిగి చనిపోయిన ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో జరిగింది. కామాక్షిపాళ్యకు చెందిన విశ్వనాథ్‌, భవ్య కొడుకు హర్ష (20) మృతుడు. సోమవారం ఉదయం హర్ష ఇంటిలో పూజలు చేసి, మా కాలేజీలో వినాయకున్ని కూర్చోబెట్టారని చెప్పి బయటకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి హెసరఘట్ట చెరువు వద్దకు వెళ్లారు. ఈతకొట్టడానికి దిగిన అతడు లోతైన చోట గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సోలదేవనహళ్లి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలించి మృతదేహాన్ని బయటకు తీసి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement