రాయచూరు రూరల్: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడిని కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన రాయచూరు జిల్లా మాన్వి పట్టణంలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి తెలిపిన వివరాలు ఇలా.. మాన్వి బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న ఇందిరా నగర్ నివాసి వసీం (25) నివాసానికి అతని స్నేహితులు జుబేర్, శారుక్ వచ్చారు. గురువారం రాత్రి వీరంతా కలిసి వసీం ఇంట్లోనే మద్యం సేవించారు. రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురూ మద్యం మత్తులో మునిగిపోయిన వేళ, వారి మధ్య ఏదో ఒక విషయంలో చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణ కాస్తా పెద్ద గొడవగా మారడంతో ఆగ్రహానికి గురైన జుబేర్, శారుక్ కలిసి వసీంపై దాడి చేశారు. అనంతరం సమీపంలో ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి వసీం తలపై బలంగా వేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వసీం అక్కడికక్కడే మృతి చెందాడు. భయాందోళనకు గురైన నిందితులు జుబేర్, శారుక్ నేరుగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మద్యం మత్తులో స్నేహితుడిని బండరాయితో కొట్టి చంపిన వైనం


