హొసపేటె: గంగావతి బస్ డిపోలో డీజిల్ కొరతతో బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ఇక్కడి రవాణా యూనిట్‌లో సుమారు 180 వాహనాలు ఉండగా.. వాటిలో 30 నుంచి 40 వాహనాలను సుదూర ప్రయాణాల కోసం జీ4 గేర్‌తో నడుపుతున్నారు. మిగిలిన వాహనాలను స్థానికంగా నడుపుతున్నారు. అయితే డీజిల్ కొరత కారణంగా గురువారం చాలా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డీజిల్ కోసం వందలాది బస్సులు ఒకేసారి రోడ్డుపై ఆగడంతో హోసల్లి రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రెండు వారాలుగా ఇక్కడి నార్త్ ఈస్టర్న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ యూనిట్‌లో డీజిల్ సరఫరాలో సమస్య నెలకొన్నట్లు సమాచారం. అందులోని డీజిల్ ఖాళీ కావడంతో సమస్య ఏర్పడింది.
నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో బీమా క్లెయిమ్
హుబ్లీ: బతికి ఉన్న వ్యక్తి చనిపోయాడంటూ నకిలీ డెత్ సర్టిఫికెట్ (మరణ ధ్రువీకరణ పత్రం) సృష్టించి ఎల్‌ఐసీ నుంచి రూ.1,27,100 బీమా క్లెయిమ్ చేశారు. హుబ్లీ దేశాయి సర్కిల్‌లోని ఎల్‌ఐసీ నగర శాఖ–2లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. బ్రాంచ్ మేనేజర్ తెలిపిన వివరాలు.. రవి కల్లప్ప అనే పాలసీదారుడు ఎల్‌ఐసీలో పాలసీ చేయించాడు. ఇందుకు నాగవ్వ కల్లప్ప నామినీగా ఉన్నారు. అయితే రవి సుంకద బతికి ఉన్న కూడా డెత్ క్లెయిమ్ సొమ్ము పొందాలనే ఉద్దేశంతో రవి సుంకద అలాగే ఆయన తల్లి నాగవ్వ సుంకద ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. 2017 ఫిబ్రవరి 1న పాలసీదారుడు రవి కల్లప్ప మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఎల్‌ఐసీ వారికి తెలిపారు. రవి సుంకద మృతి చెందాడని నాటకం ఆడి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. అనంతరం సర్టిఫికెట్‌ను ఎల్‌ఐసీ నగర శాఖ–2లో సమర్పించి రూ.1,27,100 తీసుకున్నారు. రవి సుంకద బతికే ఉన్నాడనే తెలియడంతో సదరు బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగవ్వ సుంకద, అలాగే రవి సుంకదపై హుబ్లీ ఉపనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఎలక్ట్రీషియన్ మృతి
హోసూరు: ముందు వెళ్తున్న కారును బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైకిస్ట్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. బేరికెకు చెందిన రాజేష్ (22) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం సొంత పనిపై ద్విచక్ర వాహనంలో హోసూరు వైపు బయలుదేరాడు. ఉళియాలం కూడలి వద్ద ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నెల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
లారీ పట్టివేత
హోసూరు: సేంద్రియ ఎరువుల తయారీ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వ్యర్థాలను తరలిస్తున్న లారీని అధికారులు పట్టుకున్నారు. సూళగిరి తాలూకా త్యాగరసనపల్లి సమీపంలోని సిగర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రాధాక్రిష్ణన్‌కు సొంతమైన స్థలంలో ఎరువు తయారీ చేసేందుకు కర్ణాటక, ఆంధ్రా తదితర రాష్ట్రాల నుంచి వ్యర్థాలను తరలిస్తున్నట్లు పారిశుధ్య శాఖ అధికారులకు రహస్య సమాచారం అందింది. శుక్రవారం ఉదయం అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి వ్యర్థాలను తరలిస్తున్న లారీని పట్టుకుని సూళగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
నగలు దోచుకెళ్లిన దొంగల అరెస్ట్
హోసూరు: నగలను పాలిష్ చేస్తామని చెప్పి 8 పౌన్ల బంగారు నగలను దోచుకెళ్లిన దొంగలను బర్గూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. క్రిష్ణగిరి జిల్లా బర్గూరు సమీపంలోని బి.కొత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ భార్య దైవాణి. గత జూలై 2వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. పాత నగలను పాలిష్ చేసి మెరిసేలా చేస్తామని నమ్మించారు. మహిళ 8 పౌన్ల నగలు ఇవ్వడంతో అక్కడి నుంచి పారిపోయారు. దైవాణి వెంటనే బర్గూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. గురువారం క్రిష్ణగిరి సమీపంలోని ఒప్పదవాడి ప్రాంతంలో దొంగలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసి విచారించగా.. బీహార్ రాష్ట్రానికి చెందిన సండియో ప్రసాద్‌షా, మానిష్‌షా అని తెలిసింది.


