సాక్షి, బళ్లారి: బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం విజయపురలో ఆయన విలేకరులతో మేము ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు అని.. ప్రజలే ఇంటికి పంపిస్తారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. అప్పుల బాధలు తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు ఒక హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న రైతులు పరిస్థితులను అర్థం చేసుకుని మహారాష్ట్ర తరహాలో రైతుల రుణమాఫీ చేయాల్సిన అవసరం నెలకొందన్నారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే కంటితుడుపు చర్యగా రూ.2500 ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదన్నారు. దివాళ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని పేర్కొన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించాలని తెలిపారు. వీటిన్నంటిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తమను బెదిరించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తాము ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకంగా లేము అని.. వాస్తవ పరిస్థితులను తెలియజేస్తే కులాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రమేష్ జిగిణిగి, బీజేిపీ జిల్లా అధ్యక్షుడు గురులింగప్ప తదితరులు పాల్గొన్నారు.
మేము ప్రభుత్వాన్ని కూల్చాల్సిన
అవసరం లేదు
ప్రజలే ఇంటికి పంపిస్తారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర


