దొడ్డబళ్లాపురం: దావణగెరె జిల్లాలో పలు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని సమాచారం అందడంతో డివిజనల్ ఆఫీసర్ సంతోష్, డీహెచ్‌ఓ మధు ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు చేపట్టారు. స్క్యానింగ్ సెంటర్లను పరిశీలించి, రికార్డులు పరిశీలించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే జైలు పాలవడం గ్యారంటీ అంటూ హెచ్చరించారు.
రైతుపై అటవీశాఖ
అధికారుల దాడి
రాయచూరు రూరల్: పొలం గట్టుపై చెట్లు నాటవద్దని కోరిన రైతుపై అటవీశాఖ అధికారులు, సిబ్బంది దాడి చేశారు. మస్కి తాలూకా యరదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రహదారికి ఇరువైపులా చెట్లు నాటేందుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అటవీశాఖ అధికారులు యరదొడ్డి ప్రాంతంలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తన పొలం గట్టుపై చెట్లు నాటవద్దని రైతు రమేష్ అధికారులను కోరాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు, సిబ్బంది తమనే ప్రశ్నిస్తావా అంటూ రమేష్‌ను లింగసుగూరులోని అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టారు. రమేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రైతుపై దాడికి పాల్పడిన అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
రక్తదానం..
ప్రాణదానంతో సమానం
రాయచూరు రూరల్: రక్తదానం చేసేందుకు పాత్రికేయులు ముందుకు రావాలని నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ సూచించారు. శుక్రవారం రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పాత్రికేయుల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని తెలిపారు. రక్తదానం.. ప్రాణదానంతో సమానం అని గుర్తు చేశారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్ జాగటగల్, వెంకటేశ్, చెన్నబసవ, ఖాన్‌సాబ్ మెమిన్, రోటరీ సంచాలకులు త్రివిక్రమ్ జోషి, రామరావు తదితరులు పాల్గొన్నారు.
చెత్త కుప్ప విషయంలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు
కోలారు : చెత్త కుప్ప విషయంపై ఘర్షణ జరిగి ఐదు మంది గాయపడ్డారు. ఈఘటన తాలూకాలోని తాలూకాలోని మదనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు నరసింహ నాయక్, ఆయన కుటుంబ సభ్యులకు, ఇదే గ్రామానికి చెందిన మరికొందరికి చెత్త విషయంలో గొడవ జరిగింది. ఓ దశలో వివాదం పెద్దదిగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాడిలో గ్రామానికి చెందిన శ్రీనివాస్, మంజుల, శివు, సందీప్, చంద్రు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. కోలారు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కామాంధుడికి 20 ఏళ్ల జైలు
కోలారు: మైనర్ బాలికపై అత్యాచారం కేసు విచారణ జరిపిన జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు నిందితుడు తాలూకాలోని బోడగుర్కి గ్రామ నివాసి మునివెంకటప్ప(65)కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఘటనపై కామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2024 మే 8న కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కేబీ ప్రసాద్ నిందితుడికి శిక్షను విధిస్తూ, బాధిత బాలికకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం అందించాలని తీర్పునిచ్చారు.


