శివాజీనగర: పల్లైలెనా, పట్టణాలైనా గ్రామసింహాల బెడద మామూలుగా లేదు. కనిపిస్తే చాలు గుర్రుమంటూ విరుచుకుపడతాయి. రాష్ట్రంలో రేబిస్ వ్యాధితో గత రెండు సంవత్సరాల్లో 129 మంది ప్రాణాలు కోల్పోవడమే దీనికి నిదర్శనం. వేలాది మంది కుక్క కాట్లతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ఎంతో సమయం, డబ్బు కూడా వృథా అవుతోంది. అలాగే కుక్కలు అడ్డుగా రావడం, వెంటాడడం వల్ల ద్విచక్ర వాహనదారులు, ప్రజలు కింద పడి గాయాల పాలవుతున్నారు. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
గ్రామ సింహాలను కట్టడి చేయకపోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పశు సంవర్ధక శాఖ సమాచారం ఆందోళనకు కారణమైంది. బెంగళూరు నగరంతో పాటుగా రాష్ట్రంలో వీధి శునకాలతో పాటు ఇళ్లలో పెంపుడు కుక్కల సంఖ్య అధికమైంది. కుక్కల కాటుకు ప్రజలు ఆందోళన చెందున్నారు. మరో వైపు రేబిస్ వ్యాధికి గురై బాధితులు ప్రాణాలు కోల్పోయే స్థితి దాపురించింది.
సుప్రీంకోర్టు మందలిస్తున్నా..
దేశంలో వీధి కుక్కల దాడులు, రేబిస్ మరణాలపై సుప్రీంకోర్టు తరచుగా కలవరం వ్యక్తంచేయడం తెలిసిందే. వీధి కుక్కల బెడదను అరికట్టాలని కేంద్ర, రాష్ట్రాలను కూడా ఆదేశించింది. వీధి కుక్కల సంతాన హరణ, కుక్కల ఆశ్రయ కేంద్రాల స్థాపన, విద్యా, ఇతర సంస్థల్లో వీధి కుక్కల నియంత్రణ లేదని సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో కుక్క కాట్లు, రేబిస్ మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయని హెచ్చరించింది. కన్నడనాట కూడా ఈ సమస్య అధికంగానే ఉంటోంది.నియంత్రణ చర్యలు ..
పశు సంవర్ధక శాఖ సమాచారం ప్రకారం కుక్కలకు రేబిస్ నిర్మూలన టీకాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. విద్యాలయాల్లో విద్యార్థులకు రేబిస్ ప్రమాదం గురించి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. 2024–25వ సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 8,97,557 కుక్కలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2025–26వ సంవత్సరంలో 7,93,907 కుక్కలకు టీకాలు వేశారు.
విచ్చలవిడిగా దాడులు
2 ఏళ్లలో 129 మంది మృత్యువాత
లక్షలాది మందికి కాట్లు
కానరాని నియంత్రణ చర్యలు
ఏటా లక్షలాది మందికి
2025లో రాష్ట్రంలో సుమారు 4 లక్షల మందిని కుక్కలు కరిచాయి. అంతకుముందు ఏడాది ఇది 2 లక్షల వరకూ ఉంది. ఈ ఏడాదిలో మార్చి ఆఖరికి సుమారు 50 మందిని రేబిస్ బలితీసుకుంది. బెంగళూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో కుక్క కాట్లు ఎక్కువగా ఉన్నాయి. కుక్క కాటు బాధితులకు ప్రభుత్వం రూ.5 వేల వరకూ పరిహారం ఇస్తుంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు.


