మైసూరు: నంజనగూడు రోడ్డులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో చైత్ర శుద్ధ పౌర్ణమిలో భాగంగా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామి మార్గదర్శకత్వంలో విశేష పూజా వేడుకలు సాగాయి. వజ్రాంగి రూపంలో మారుతి విగ్రహాన్ని సుందరంగా అలంకరించారు. ఆశ్రమం జూనియర్ హెడ్ దత్త విజయానంద తీర్థ స్వామి ప్రసంగిస్తూ భజరంగి అంటే వజ్రాంగి, వజ్రం వంటి శారీరక బలంతో, పువ్వు వంటి సున్నితమైన మనస్సుతో ఆశీర్వదించే హనుమంతుడు అని పేర్కొన్నారు. ఆంజనేయునికి తమలపాకు పూజ ప్రాముఖ్యతను వివరిస్తూ ‘తమలపాకు మన హృదయానికి ప్రతీక. మన మనస్సును, హృదయాన్ని స్వామికి సమర్పించడం’ అని తెలిపారు.
రాఘవులకు అభిషేకం
బనశంకరి: జయనగర ఐదో బ్లాక్‌లోని నంజనగూడు శ్రీగురు రాఘవేంద్రస్వామి మఠంలో గురు రాఘవేంద్రులస్వామికి ప్రత్యేక పూజలతో పాటు హనుమజ్జయంతిని నిర్వహించారు. బృందావనానికి వివిధ అభిషేకాలను నిర్వర్తించారు. సాయంత్రం రథోత్సవం, ఉయ్యాల సేవ సాగింది, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.
డయాలసిస్‌కు ఏఐ పరిజ్ఞానం
శివాజీనగర: బెంగళూరులోని కేసీ జనరల్ ఆసుపత్రిలో ఏఐ ఆధారిత డయాలసిస్ సేవలను అందించనున్నట్లు ఆరోగ్యమంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. తద్వారా రోగులకు మరింత మెరుగైన డయాలసిస్ అందుతుందని అన్నారు. ఇందుకోసం ఓ ప్రైవేటు సంస్థ సహకారం అందిస్తుందని చెప్పారు. మూత్రపిండ రోగులకు డయాలసిస్ అవసరం అవుతుంది. ఈ ప్రక్రియను మరింత ప్రభావవంతంగా నిర్వహించవచ్చని అన్నారు. రాష్ట్రంలో 7 డయాలసిస్ కేంద్రాల్లో ఏఐ పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రేమకు పెద్దల అడ్డు.. యువ జంట బలవన్మరణం
మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని పొన్నాచి గ్రామంలో ప్రేమికులు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నదియా (19), నాగేంద్ర (21) మృతులు. పాలార్ గ్రామానికి చెందిన నదియాను నాగేంద్ర ప్రేమించాడు. వారి పెళ్లికి నదియా కుటుంబం అంగీకరించలేదు. మూడు రోజుల క్రితం, నాగేంద్ర నదియాను పొన్నాచిలోని తన తాత ఇంటికి తీసుకువెళ్లాడు. తన కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి మహాదేవ్ మలేమహదేశ్వర హిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తమ ప్రేమకు ఎవరూ సహకరించడం లేదని, కలిసి జీవించలేము కాబట్టి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. తాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో, నదియా, నాగేంద్ర ఇద్దరూ ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి.
దావణగెరెలో సీఎం రోడ్‌షో
సాక్షి, బళ్లారి: ఈనెల 9న జరగనున్న దావణగెరె దక్షిణ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య గురువారం సుడిగాలి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ మైనారిటీలకు టికెట్ ఇవ్వలేదని వివాదం సాగడం తెలిసిందే. దీంతో మైనార్టీ ఓట్లను ఆకట్టుకునేందుకు సీఎం దావణగెరెలోని ప్రఖ్యాత కడక్ చమన్ షాషావలి దర్గాను సందర్శించి ప్రార్థన చేశారు. మైనార్టీలతో కలియతిరుగుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు కదిలారు. రాత్రి వరకూ ప్రచారం కొనసాగించారు.


