శివాజీనగర: డేటింగ్ యాప్‌లో పరిచయమైన మోసగత్తె పెళ్లి చేసుకుంటానని ఐటీ ఇంజనీరును నమ్మించి రూ.18.70 లక్షలు మోసగించింది. వివరాలు.. గతేడాది నవంబరులో బెంగళూరులో ఓ టెక్కీ (29)కి యువతి పరిచయమైంది. తనది ముంబై అని, పేరు అంజలి కుశ్లాని అని చెప్పుకుంది. వాట్సాప్‌లో మాట్లాడుకుంటూ ప్రేమిస్తున్నట్లు, త్వరలోనే వివాహం చేసుకుందామని నమ్మించింది. తన ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరగా, అతడు సరే అన్నాడు. అలా.. తీయని మాటలతో పల్టీలు కొట్టించి రూ. 18.70 లక్షలను ఆన్‌లైన్‌లో వసూలు చేసింది. ఇటీవల బాధితుడు తన సొమ్మును వెనక్కి ఇవ్వాలని కోరగా మాయలాడి ఫోన్‌ను స్విచాఫ్ చేసింది. మోసపోయానని తెలుసుకొని టెక్కీ తూర్పు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
షేర్ల పేరుతో రూ.19 లక్షల బురిడీ..
● మైసూరులో సైబర్ దందాలు
మైసూరు: ప్యాలెస్ సిటీలో రెండు సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయన్న ప్రకటనను నమ్మి, ఓ వృద్ధుడు రూ. 19.65 లక్షలు కోల్పోయాడు. మైసూరులోని యాదవగిరికి చెందిన ఆ వ్యక్తి ఇంటర్నెట్‌లో ఓ ప్రకటనను చూసి ఫోన్‌లో సంప్రదించాడు. జస్టిన్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన వృద్ధుడు పలు విడతలలో రూ. 19.65 లక్షలు బదిలీ చేశాడు. మరింత డబ్బు బదిలీ చేయాలని మోసగాళ్లు ఒత్తిడి చేయడంతో ఇదో స్కాం అని గ్రహించాడు. సైబర్ సహాయవాణి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
మహిళ ఫోన్ హ్యాక్ చేసి
మైసూరు: సైబర్ నేరగాళ్లు ఒక మహిళ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 1.84 లక్షలు దొంగిలించారు. మైసూరులోని గోకులానికి చెందిన ఈ మహిళ మొబైల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆమె లింకు నొక్కడంతో కొంతసేపు ఫోన్ పనిచేయలేదు. ఈలోగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి పై మొత్తాన్ని బదలాయించుకున్నారు. జయలక్ష్మీపురం ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది.
టెక్కీకి రూ.18 లక్షల టోపీ


