సాక్షి,బళ్లారి: దావణగెరె దక్షిణ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్ధకు మద్దతుగా సీఎం సిద్ధరామయ్య రంగంలోకి దిగి నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి సమర్ధతో పాటు పలువురు కాంగ్రెస్ మంత్రులు, ప్రముఖులు ర్యాలీలో పాల్గొనడంతో నగర వీధులు జన సంద్రంగా మారాయి. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేసి సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ముఖ్యంగా పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ప్రజల విశ్వాసమే తమ బలం అని అన్నారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఉప ఎన్నికల్లో దావణగెరెతో పాటు బాగల్‌కోటె రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు.
కేంద్ర బడ్జెట్ కంటే రాష్ట్ర బడ్జెట్టే మెరుగు
కేంద్ర బడ్జెట్ కన్నా రాష్ట్ర బడ్జెట్ నూరు రెట్లు ప్రజలకు మేలు చేస్తోందని, బీజేపీ నాయకులు రాష్ట్ర బడ్జెట్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం దావణగెరె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవనున్నారన్నారు. బీజేపీ నేతలు పేదల సంక్షేమం గురించి ఆలోచించడం లేదన్నారు. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టే కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. గ్యారెంటీలకు దాదాపు రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇదంతా పేదల సంక్షేమం కోసమేనన్నారు. దీనిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. సమాజంలో కింది స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నామన్నారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
– సీఎంకు విజయేంద్ర సవాల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సవాల్ విసిరారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నామని తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే మీరు ఎంత మందికి సంక్షేమ పథకాలు అందించారో, ఎన్ని వేల కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు చేశారో జనం ముందే చర్చిద్దామని అన్నారు. ప్రతి జిల్లాకు వెళ్లి ఆయా జిల్లాల్లో ఎంత అభివృద్ధి చేశారో, ఎన్ని వేల మందికి మేలు చేశారో ప్రజలను అడిగి తెలుసుకుందామా? అని ప్రశ్నించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అప్పుల ఊబిలోకి రాష్ట్రం
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఆయన సిద్ధరామయ్య కాదు, అప్పుల రామయ్యగా కీర్తింపబడతారన్నారు. అప్పులు చేసి కూడా జనంకు మేలు చేశారా అంటే అదీ లేదన్నారు. నిధులన్నీ ఎక్కడికి మళ్లించారో వారికే తెలియాలన్నారు. బడ్జెట్ ఎన్నిసార్లు ప్రవేశపెట్టామన్నది ముఖ్యం కాదని, ప్రజలకు ఎంత మేలు చేశామన్నది ఎంతో ముఖ్యం అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఫించన్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగులు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లకు కూడా జీతాలు ఇవ్వడం లేదన్నారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. చివరకు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు కూడా మళ్లించి వారి సంక్షేమాన్ని అటకెక్కించారన్నారు.
దావణగెరెలో సీఎం సిద్ధరామయ్య రోడ్ షో
కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా
భారీ ఎత్తున ప్రచారం


