● ఒకరు మృతి, నలుగురికి గాయాలు
తుమకూరు: వంతెన గోడను కారు ఢీకొని మంటల్లో చిక్కుకోగా, ఒకరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హులియారు హోబళి కోరగెరె వద్ద జరిగింది. తిమ్మనహళ్లి గ్రామానికి చెందిన రామయ్య (55), మరో నలుగురితో కలసి అరసికెరె తాలూకా అమ్మనహట్టి మాళమ్మ ఆలయాన్ని దర్శించుకుని కారులో తిరిగి వస్తుండగా కోరగెరె సమీపంలోని వంతెన గోడను వేగంగా ఢీకొన్నారు. ఈ ధాటికి కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందరూ లోపలే చిక్కుకుపోయారు. ఇతర వాహనదారులు కారు అద్దాలు పగులగొట్టి వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రామయ్య కారు లోపలే చనిపోయాడు. మిగతావారిని చిక్కనాయకనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీటి ట్యాంకర్‌ను పిలిపించి మంటలను అదుపు చేశారు. హుళియారు పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
అకారణంగా దౌర్జన్యం
యశవంతపుర: మత ప్రచారానికి పాల్పడుతున్నారంటూ ఇద్దరు వ్యక్తులపై దౌర్జన్యం చేసిన ఘటన చిక్కమగళూరు తాలూకా హొసపేట గ్రామంలో జరిగింది. వివరాలు.. హోసపేట గ్రామంలో వారపు సంత జరిగింది. అక్కడకు ఓమ్ని కారులో వెళ్లిన భద్రావతి తాలూకాకు చెందిన ఇద్దరు చేతితో రాసిన కరపత్రాలను పంచసాగారు. అయితే కొందరు వారిని మత ప్రచారం చేస్తున్నారా? అని అడ్డుకుని దౌర్జన్యం చేశారు. తప్పించుకొని కారులో పారిపోవడానికి యత్నించగా 10 కిలోమీటర్ల దూరంలోని కైమర చెక్‌పోస్టు వద్ద అడ్డగించి పోలీసులకు అప్పగించారు. తమ మీద అకారణంగా దౌర్జన్యం చేశారని కారులోని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


