దొడ్డబళ్లాపురం: ఆలయంలోకి చొరబడిన దొంగ అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారు నగలను దర్జాగా దోచుకుని పరారైన సంఘటన కలబుర్గి పట్టణంలోని కువెంపు నగరలోని మహాలక్ష్మి దేవాలయంలో జరిగింది. దేవాలయం తలుపుల తాళం పగలగొట్టి చొరబడిన దొంగ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం మీద ఉన్న బంగారు నగలను తీసుకుని వెళ్లిపోయాడు. అక్కడి సీసీ టీవీ కెమెరాలో చోరీ మొత్తం రికార్డయింది. ఆలయ పెద్దలు స్టేషన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సిలిండర్ లీకై మంటలు
బనశంకరి: గ్యాస్ సిలిండర్ పేలిపోయిన ఘటన బెంగళూరులో లగ్గెరె రాజీవ్‌గాంధీ నగరలో బుధవారం జరిగింది. మూడంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో హరగయ్య, భాగ్యమ్మ దంపతులు, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఖాళీ కావడంతో కొత్త సిలిండర్‌ను అమర్చుతుండగా గ్యాస్ ఎగదన్ని మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో ఇళ్లంతా వ్యాపించడంతో కుటుంబసభ్యులు ప్రాణభయంతో బయటకు పరిగెత్తారు. ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
టీవీలో పాము మకాం
మైసూరు: సామాన్యంగా టీవీ పాడైపోతే మెకానిక్ దగ్గరికి తీసుకెళతారు. అయితే చామరాజనగర మల్లయ్యనపుర గ్రామంలో దొడ్డమాదప్ప ఇంటిలో జరిగింది వేరే. కొన్ని రోజుల నుంచి ఇంట్లో టీవీ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ శబ్ధాలు ఎక్కువ కావడంతో టీవీ లోపల చూసి నిశ్చేష్టులయ్యారు. లోపల ఏదో కదులుతూ కనిపించింది. ఆ తర్వాత అది పాము అని తెలిసి వెంటే స్నేక్ చాపు నకు కాల్ చేశారు. స్నేక్ చాపు టీవీని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి అందులో మకాం వేసిన 8 అడుగుల విషపూరిత పామును పట్టుకున్నాడు. టీవీ వైర్ల మధ్య చుట్టుకుని ఉందది. ఇంటి చుట్టుపక్కల ఎలుకలు, కప్పలు ఎక్కువగా ఉండడంతో వాటి కోసం వచ్చి టీవీలో చేరినట్లు స్నేక్ చాపు తెలిపాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
స్కూలు బస్సు కింద నలిగి...
శివమొగ్గ: నగరంలోని గోపాలగౌడ బడావణెలో మంగళవారం మధ్యాహ్నం స్కూలు బస్సు ఢీకొని రెండేళ్ల బాలునికి నూరేళ్లు నిండాయి. బడావణె నివాసి మంజునాథ్ కుమారుడు ఆర్యన్ (2) మృతుడు. వివరాలు.. మంజునాథ్‌కు ముగ్గురు కొడుకులు. ఓ కొడుకు ఆరుష్, ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మధ్యాహ్నం స్కూలు బస్సులో ఇంటికి వచ్చాడు. వీధిలో నుంచి ఇంటికి పిలుచుకొచ్చేందుకు పని మనిషి ఆశా బస్సు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె వెనుక ఆర్యన్ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లాడు. ఆశా ఆరుష్‌ను తీసుకుని వెనుదిరిగింది. ఆర్యన్ బస్సు ముందు నడుస్తుండగా గమనించని డ్రైవర్ బస్సును నడపడంతో అతనిని ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రగాయాలైన చిన్నారి అక్కడే చనిపోయాడు.
నిప్పంటించుకుని.. ప్రైవేటు నర్సు ఆత్మహత్య
శివమొగ్గ: నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన ప్రైవేటు ఆస్పత్రి నర్సు చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. వివరాలు.. జిల్లాలోని సొరబ తాలూకా ఉళవికి చెందిన శ్వేత (30)కు అదే ఊరికి చెందిన నవీన్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది, శ్వేత ప్రస్తుతం 4 నెలల గర్భిణి, ఏం జరిగిందో కానీ ఆమె ఇంటిలోనే నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్ర కాలిన గాయాలైన ఆమెను భర్త, స్థానికులు మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. 90 శాతం కాలిన గాయాలైన శ్వేత కన్నుమూసింది. కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు తెలిసింది.


