ఎన్‌ఆర్‌బీసీకి ఏప్రిల్‌ వరకు నీరందివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌బీసీకి ఏప్రిల్‌ వరకు నీరందివ్వాలి

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

రాయచూరు రూరల్‌: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్‌ నెలాఖరు వరకు చివరి భూములకు నీరందివ్వాలని మాజీ మంత్రి రాజు గౌడ, యాదగిరి నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపూరే డిమాండ్‌ చేశారు. బుధవారం సురపుర తాలూకా హుణసిగి కృష్ణా భాగ్య జల మండలి కార్యాలయం వద్ద వంద ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టి మాట్లాడారు. అధికారులు ఐసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట ఎండిపోతుందని మండిపడ్డారు. నీటి గేజ్‌ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు చివరి భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. నీరందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారన్నారు. కాలువకు ఏప్రిల్‌ వరకు చివరి భూములకు వారబందీ పద్ధతిలో నీరందించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు

సెలవులు పొడిగించాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు వేసవి సెలవులను పొడిగించాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్‌ చేసింది. బుధవారం నగరంలోని టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర అధ్యక్షురాలు మందా మాట్లాడారు. వేిసవి సెలవుల్లో కోత విధించడం తగదని, పూర్తి స్థాయిలో నెల రోజుల పాటు సెలవులు కేటాయించాలన్నారు. ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు మాత్రమే ఇచ్చారని, గత ఏడాది నెల రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏప్రిల్‌ 14 వరకు పని చేసి 16 నుంచి నెలాఖరు వరకు సెలవులు ప్రకటించడం శోచనీయమన్నారు. మే నెలలో అత్యధికంగా ఎండల వేడిమి ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 16 నుంచి మే 16 వరకు సెలవులు కేటాయించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

కళ్యాణ కర్ణాటకలో కార్యాలయ పని వేళల్లో మార్పులు

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్‌, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయ నగర జిల్లాల్లో బుధవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్‌, మే నెలల్లో రెండు నెలల పాటు వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వ అదనపు కార్యదర్శి విమలాక్షి పత్రికా ప్రకటనలో తెలిపారు. బుధవారం జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ ఉదయం 8 గంటల సమయంలో ఉద్యోగులు, సిబ్బంది హాజరును, విధుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆస్తి కోసం యువకుడి హత్య

రాయచూరు రూరల్‌: రెండు ఎకరాల ఆస్తి కోసం ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన యాదగిరి జిల్లాలో సంచలనం రేపింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మావినమట్టిలో మంగళవారం రాత్రి ఈ ఘటన సంభవించింది. రెండు ఎకరాల భూమి పంపిణీ విషయంలో పరమేశ్వర(27)ను అతని పెదనాన్న హనుమంతరాయ, కుమారులు కలిసి తల్వార్‌, కత్తులతో దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 21 మందిపై కేసు నమోదు చేశామని ఆ జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్‌ తెలిపారు.

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

హొసపేటె: వాల్మీకి మహిళా కళా సంస్థ ఆధ్వర్యంలో హొసపేటెలోని శంకర్‌ ఆనంద్‌సింగ్‌ ఫస్ట్‌ గ్రేడ్‌ కళాశాలలో ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని సీనియర్‌ రంగస్థల కళాకారుడు ఎంబీ సోమన్న ప్రారంభించి మాట్లాడుతూ రంగస్థల కళాకారులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. వారికున్న ఆర్థిక సమస్యలతో ఈ రోజు కళాకారులు తమ వృత్తికి న్యాయం చేయడం లేదన్నారు. సీనియర్‌ రంగస్థల కళాకారుడు గుబ్బి వీరన్న అవార్డు గ్రహీత డాక్టర్‌ కే.నాగరత్నమ్మ, కళాశాల ప్రిన్సిపాల్‌ వీరభద్రప్ప తంబ్రహళ్లి, సంస్థ అధ్యక్షురాలు వి.అనురాధ, కళాకారుడు, జర్నలిస్టు నాగరాజ్‌ మడ్లకనహళ్లి, గిణిగేరి దేవరాజ్‌ మాస్టర్‌, మధుర చెన్నశాస్త్రి, మల్లికార్జున తురువనూరు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement