తుంగభద్ర బోర్డు ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

తుంగభద్ర బోర్డు ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

హొసపేటె: తుంగభద్ర జలాశయం పరిధిలో వచ్చే వందలాది ఎకరాల భూమి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల ఉమ్మడి ఆస్తి అని, ఇక్కడ జరిగే ఎలాంటి అనధికార ఆక్రమణలపైనా కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తుంగభద్ర బోర్డు కార్యదర్శి ఓఆర్‌వీ రెడ్డి హెచ్చరించారు. బుధవారం నగరంలోని తుంగభద్ర జలాశయ నిర్వహణ బోర్డు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హొసపేటె పరిధిలో 207.41 ఎకరాలు, అమరావతి పరిధిలో 488.74 ఎకరాలతో సహా మొత్తం 696.15 ఎకరాల భూమి బోర్డు ఆధీనంలో ఉందన్నారు. ఇందులో గార్డెన్‌, బ్యాక్‌వాటర్‌, నిషాని క్యాంప్‌, అమరావతి కాలనీ, హెచ్‌ఈఎస్‌ కాలనీలు ఉన్నాయి. ప్రస్తుతం బోర్డు భూమికి సంబంధించి మొత్తం 23 కేసులు వివిధ దశల్లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ధార్వాడ హైకోర్టు బెంచ్‌, హొసపేటె సివిల్‌ కోర్టుల్లో ఉల్లంఘన కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జలాశయం భద్రతను, బోర్డు ఆస్తిని పరిరక్షించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు.

మే నెలాఖరుకు అన్ని పనులు పూర్తి

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌ గేట్లను అమర్చే పనులు పూర్తి వేగంతో జరుగుతున్నాయి. ఇప్పటికే 22 గేట్లను అమర్చారు. మిగిలినవి ఈ నెలలో పూర్తి అవుతాయని భావిస్తున్నాం. దీనికి అదనంగా మే నెలాఖరు నాటికి గొలుసులు అమర్చే పనులు కూడా పూర్తవుతాయన్నారు. జూన్‌లో వర్షాకాలం నాటికి డ్యాం పూర్తిగా సిద్ధమవుతుందని ఆయన అన్నారు. పత్రికా సమావేశానికి ఎస్‌ఈ నారాయణ నాయక్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌వీ రెడ్డి హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement