వరకట్న వేధింపులకు గృహిణి బలి | - | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులకు గృహిణి బలి

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

హుబ్లీ: వరకట్న వేధింపులకు ఓ గృహిణి బలైన ఘటన కేశ్వాపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. శిల్ప(25) ఆత్మహత్య చేసుకున్న గృహిణి. ఈ కేసులో మృతురాలి అత్త అన్నపూర్ణ, మామ ప్రవీణ్‌, ఆడపడుచు జ్యోతితో పాటు ముగ్గురిపై కేసు నమోదైంది. నాలుగేళ్ల క్రితం హనుమంతను పెళ్లి చేసుకున్న శిల్పను అత్త అన్నపూర్ణ పెళ్లి సమయంలో ఏమీ తేలేదంటూ నిత్యం వేధించేది. దీంతో శిల్ప పుట్టింటికి వచ్చింది. తిరిగి రాజీ చేయడంతో మళ్లీ మెట్టింటికి వెళ్లింది. అయినా వారు హింసించడం మానక పోవడంతో మనోవేదనకు గురై తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి సుజాత పాటిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేశ్వాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సర్కార్లు రైతు వ్యతిరేక విధానాలు వీడాలి

రాయచూరు రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని అఖిల భారత రైతు సంఘం సంచాలకుడు రంగయ్య పేర్కొన్నారు. సోమవారం రాత్రి టిప్పుసుల్తాన్‌ ఉద్యాన వనంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్మికుల నుద్దేశించి మాట్లాడారు. కార్పొరెట్‌ రంగాల పరంగా మారిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, స్వామినాథన్‌ నివేదికల ఆధారంగా మద్దతు ధరలు ప్రకటించాలని, భూమి లేని పేదలకు దున్నేవాడికి మిగులు భూములు పంపిణీ చేయాలన్నారు. డీహెచ్‌ పూజార్‌ మాట్లాడుతూ ఇటీవల ఇరాన్‌, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంతో వ్యవసాయ చట్టాలు రైతులకు గుదిబండల్లా మారాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాన్య మానవుడి జీవితం దుర్భరంగా మారక మునుపే ప్రభుత్వాలు మేల్కొనాలన్నారు. సమావేశంలో అశోక్‌, రాము, నిర్వహణప్ప, ఖాజా అస్లాం పాషా, రమేష్‌, జాన్‌ వెస్లీ, నరసప్ప, బేరి, బసవరాజ్‌, శ్రీనివాస్‌లున్నారు.

కార్మికులకు కనీస వేతనాలివ్వరూ

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. అసంఘటిత వలయంలో విధులు నిర్వహించే మహిళా కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.43 వేల వరకు వేతనాలు చెల్లించేలా బిల్లు ప్రవేశ పెట్టి తమను ఆదుకోవాలని కోరారు. పోక్సో చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, రాత్రి వేళలో పనులు చేయించుకోరాదని, పరువు హత్యల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గోకారమ్మ, వీరేష్‌, శరణ బసవ, వరలక్ష్మి, జమున, కరియప్ప, మహాదేవిలున్నారు.

బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ

రాయచూరు రూరల్‌: వ్యవసాయ పొలంలోని నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు ఇటీవల దుర్మరణం పాలైన ఘటన నేపథ్యంలో యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్‌ పర్యటించారు. మంగళవారం కెంబావి తాలూకా నాగనూరులో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించారు.

అగ్నిప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

హుబ్లీ: పెట్రోల్‌ నిల్వ చేసిన ఇంటికి ఆకస్మికంగా నిప్పు అంటుకొన్న ఫలితంగా గృహిణి తీవ్రంగా గాయపడిన ఘటన ధార్వాడ తాలూకా తడకోడ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పూర్ణిమ(32) తీవ్రంగా గాయపడిన మహిళ. 80 శాతం శరీరం కాలిన స్థితిలో ముందుగా జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్‌ కొరత నేపథ్యంలో ఓ క్యాన్‌లో పెట్రోల్‌ నింపి ఆ ఇంట్లోని ఫ్రిజ్‌ వద్ద పెట్టారు. పూర్ణిమ వంటింట్లో ఉన్న వేళ ఉన్న ఫళంగా ఆ పెట్రోల్‌ క్యాన్‌కు నిప్పంటుకొని పేలింది. దీంతో ఇల్లంతా మంటలు వ్యాపించడంతో వంటింట్లో ఉన్న వదినను మరిది యల్లప్ప కాపాడే ప్రయత్నంలో అతడికి కూడా గాయాలయ్యాయి. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఆ ప్రమాద వేళలో ఇంట్లోని వారు బయట కూర్చున్నందువల్ల పెద్ద ప్రమాదం తప్పిందని గరగ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పేందుకు కృషి చేశారు.

మంటలు చెలరేగి కారు దగ్ధం

మరో ఘటనలో ధార్వాడ బైపాస్‌ రోడ్డులో వెళుతున్న ఓ కారులో సాంకేతిక సమస్యతో ఆకస్మికంగా మంటలు కనిపించి కారు పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదాన్ని పసిగట్టిన కారులో ఉన్న వారు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణనష్టం జరగలేదు. ఆనంద్‌ నగర నివాసి ఆసిఫ్‌కు చెందిన కారులో బెళగావికి వెళుతుండగా కారు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ఇంజిన్‌ నుంచి పొగ రావడంతో డ్రైవర్‌ గమనించి కారును నిలపడంతో ప్రయాణికులు హుటాహుటిన బయట పడ్డారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement