ఏప్రిల్‌ నెలాఖరుకు గేట్ల ఏర్పాటు పనుల పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ నెలాఖరుకు గేట్ల ఏర్పాటు పనుల పూర్తి

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

టీబీ డ్యాం గేట్ల అమరిక పనుల

పరిశీలనలో మంత్రి, ఎమ్మెల్యే

హొసపేటె: తుంగభద్ర డ్యాంకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న గేట్ల పనులను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పయ్యావుల కేశవ్‌, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ఏర్పాటు ప్రక్రియ, బిగింపు పనులు ఏప్రిల్‌ నెలాఖరు నాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో కర్ణాటక ప్రభుత్వం కూడా త్వరితగతిన పనులు చేపట్టిందన్నారు. గేట్ల బిగింపు పనులు పూర్తయితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఇప్పటికే 18 కొత్త గేట్లు అమర్చారన్నారు. తుంగభద్ర డ్యాం పాత గేట్లతో పాటు పాత గొలుసు(చైన్‌)లను కూడా మార్చుతున్నామని చెప్పారు. మండలి కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ నారాయణ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో బైకిస్టు మృతి

హొసపేటె: అతి వేగంగా వస్తున్న లారీ ముందు వెళుతున్న బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో బైక్‌ చోదకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన మంగళవారం తాలూకాలో దానాపుర గ్రామం వద్ద జరిగింది. మృతుడిని తాలూకాలోని గుండా తాండాకు చెందిన కిరణ్‌ (27)గా గుర్తించారు. మందులు తేవడానికి హొసపేటె నగరం వైపు బైక్‌పై వెళుతూండగా బెంగళూరు నుంచి అహమ్మదాబాద్‌కు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. తల, వీపు, ముఖానికి తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మరణించాడు. వెనుక నుంచి ఢీకొన్న లారీని పట్టుకున్న మరియమ్మనహళ్లి పోలీసులు ఆ లారీ డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హగరిబొమ్మనహళ్లి సీఐ వికాస్‌ లమాణి, మరియమ్మనహళ్లి స్టేషన్‌ ఎస్‌ఐ తారాబాయి పరిశీలించారు.

యువత మత్తుకు

బానిస కారాదు

రాయచూరు రూరల్‌: నేటి తరం యువకులు మత్తు పదార్థాలకు బానిస కారాదని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. సోమవారం రాత్రి నగరంలోని హరిజన వాడలో మద్యం, సీహెచ్‌ పౌడర్‌ గంజాయి, హఫీం వంటి వాటికి బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే మద్యానికి యువకులు దూరంగా ఉండాలన్నారు. పోలీసులకు సమాచారం అందించి వాటి నియంత్రణకు సహకరించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ కుమారస్వామి, డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజ్‌, ఎస్‌ఐలు బపవరాజ్‌, మహ్మద్‌ ఇషాక్‌, యల్లప్ప, రాజు, నరసింహులు, అనిల్‌ కుమార్‌లున్నారు.

హిడకల్‌ డ్యాంలో ఇద్దరు చిన్నారుల గల్లంతు

రాయచూరు రూరల్‌: హిడకల్‌ డ్యాంలో పడి ఇద్దరు చిన్నారులు నీటి పాలైన ఘటన బెళగావి జిల్లా యమకనమరడి తాలూకాలో చోటు చేసుకుంది. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సోమవారం గుడుగనకట్టి గ్రామానికి చెందిన ప్రజ్వల్‌(11), కృష్ణ విఠల్‌(11) అనే పిల్లలు స్నానం చేయడానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. యమకనమరడి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement