బళ్లారి రూరల్ : మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని బళ్లారి క్యాథలిక్ రైట్ రెవరెండ్ బిషప్ హెన్రి డిసౌజ తెలిపారు. మహిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, బళ్లారి భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానం. వారు లేకపోతే సమాజం సృష్టి, అభివృద్ధి లేదని తెలిపారు. ప్రతి ఒక్కరు కళ్లల్లో కరుణ, ముఖంలో కళ, నోటిలో సత్యం, హృదయంలో ప్రేమ, మనస్సులో మంచి, కాళ్లు, చేతుల్లో సేవాభావాలు కలిగి ఉండాలన్నారు.
మొదటి జైల్ సూపరింటెండెంట్‌ను నేనే
ముఖ్యఅతిథిగా బళ్లారి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ లతా మంజునాథ్ మాట్లాడుతూ తాను రాష్ట్ర మొట్ట మొదటి జైల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలను తీసుకొన్నప్పుడు ఎంతో భయం వేసిందన్నారు. ఒక మహిళ జైల్ సూపరింటెండెంట్‌గా వెళ్లడమా అని అందరిలోను ఒకింత భయం, ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులోను బళ్లారి సెంట్రల్ జైలు అంటే ఇంకెంత భయపడాల్సిన అవసరమో చెప్పనవసరం లేదు. అధికారులు నేను ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలనా? అని తొలుత సందేహించారు. అప్పుడు తాను పరప్పన అగ్రహార, బళ్లారి సెంట్రల్ జైళ్లలో కూడా పని చేయగలనని చెప్పాక పోస్టింగ్ ఇచ్చారన్నారు. ప్రతి మహిళ అభివృద్ధి వెనుక పురుషుడు ఉన్నట్లుగా తన వెనుక తన భర్త, పై అధికారుల ప్రోత్సాహం ఉందన్నారు. రాష్ట్ర ఐఎంఏ ప్రముఖుడు డాక్టర్ యోగానందరెడ్డి మహిళల సమానతపై మాట్లాడారు. అనంతరం మహిళలను సన్మానించారు. డాక్టర్ షడ్రక్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ నాగరాజరావు, రెడ్‌క్రాస్ ప్రముఖుడు షకీబ్, మహిమ నర్సింగ్ కళాశాల డైరెక్టర్ సహన, ఫాతిమా, లిల్లిమేరి, సెలిన్ ఫిలిప్, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలు లేకుంటే సమాజం సృష్టి, అభివృద్ధి లేదు
బళ్లారి క్యాథలిక్ రైట్ రెవరెండ్ బిషప్ హెన్రి డిసౌజ


