దేశ ఐక్యతకు కలిసికట్టుగా శ్రమిద్దాం
సాక్షి,బళ్లారి: దేశ ఐక్యత కోసం కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగ మందిరంలో జిల్లా పంచాయతీ, జిల్లా పాలన యంత్రాంగం ఆధ్వర్యంలో భారత దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత దేశ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ దేశ ఐక్యత కోసం కోసం శ్రమించారని కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, దేశ ఐక్యత, దేశభక్తి తదితరాలు మరువలేనివన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ బలిదానాలతో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. సర్దార్ వల్లభాయి వంటి మహానుభావులు దేశానికి చేసిన సేవలు అవిస్మరణీయం అన్నారు. ప్రపంచంలోనే భారత దేశం బలిష్టంగా మారిందన్నారు. భారత దేశ సైనికులు దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పిస్తున్నారని ప్రశంసించారు. దేశాభివృద్ధికి చేపడుతున్న చర్యలు ఎనలేనివన్నారు. దేశ రక్షణ, ఐక్యత, అభివృద్ధి తదితరాలకు సర్దార్ వల్లభాయి పటేల్ తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పవి అని కొనియాడారు. భారతదేశానికి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం మరింత ముందుకు వెళుతోందన్నారు. గుజరాత్‌లో 182 మీటర్ల ఎత్తున పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనంతరం నగరంలో నిర్వహించిన ఏకతా కార్యక్రమం నగర ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, నగర మేయర్ గాదెప్ప, కార్పొరేటర్ మోత్కూర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయి పటేల్
గొప్ప పాలనా దక్షుడు
బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే
గాలి సోమశేఖర్‌రెడ్డి


