హొసపేటె: తాలూకాలోని చిక్కజోగిహళ్లి, గుడేకోటెను బుధవారం సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.టీ.శ్రీనివాస్ ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాను ఇప్పటికే రూ.1,250 కోట్లకు పైగా గ్రాంట్లను తీసుకువచ్చానన్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను నమ్మి గెలిపించిన రుణాన్ని తీర్చుకోవడం తన విధి అన్నారు. అందువల్ల తాను ప్రతి దశలోనూ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నానన్నారు. చిక్కజోగిహళ్లి, గుడేకోటెలో వెటర్నరీ హాస్పిటల్, కర్ణాటక పబ్లిక్ స్కూల్, స్టూడెంట్ హాస్టల్స్, టూరిస్ట్ సెంటర్, రైతు సంపర్క కేంద్రాలను స్వయంగా సందర్శించి తనిఖీ చేసిన ఎమ్మెల్యే అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి అధికారుల నుంచి కూడా సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు సేవ చేయండి
రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు సేవ చేయాలని జిల్లా శరణ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు నాగరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రభభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా శరణ సాహిత్య పరిషత్, కదళి మహిళా వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దత్తి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు వినయం, విద్య, సంస్కృతి, ఆచార విచారాలు, పెద్దలను గౌరవించడంతో పాటు వయోవృద్ధులైన తల్లిదండ్రులకు సపరిచర్యలు చేయాలన్నారు. ప్రిన్సిపాల్ సుగుణ, లలిత, శరణ బసవరాజ్, సంతోష్ కుమార్, రేఖ, ఉమాదేవి, శరణగౌడ, జ్యోతి, ప్రసన్న, పుష్పవతిలున్నారు.
బిల్లు బకాయిలు చెల్లించరూ
రాయచూరు రూరల్: నగరసభ ఆధీనంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లు బకాయిలు చెల్లించాలని రాయచూరు జిల్లా కాంట్రాక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం నగరసభ కార్యాలయంలో నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రోను కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు రాజు పట్టి కలిసి మాట్లాడారు. కాంట్రాక్టర్ల సంఘం ప్రభుత్వ ఆధీనంలోని పలు శాఖల పనులను టెండర్ ద్వారా చేపట్టినట్లు తెలిపారు. పనులు పూర్తయినా బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లపై అదనపు భారం పడుతుందన్నారు. కాంట్రాక్టర్ల బాధలను అర్థం చేసుకొని జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఇందిరా గాంధీ జయంతి
రాయచూరు రూరల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని ఆచరించారు. జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, ఆర్డీఏ అధ్యక్షుడు రామస్వామి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. భారత ప్రధానమంత్రిగా దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. పేదల సంక్షేమానికి వివిధ పథకాలను జారీ చేసిన ఉక్కుమహిళ అని ప్రశంసించారు. కార్యక్రమంలో నగర అద్యక్షుడు శ్రీనివాస రెడ్డి, శాలంలున్నారు. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని జరిపారు. కార్యక్రమంలో శశికళ, ఇందిర, ప్రేమలత, నాగవేణి, రాణి రిచర్డ్‌లున్నారు.
వరికోత యంత్రానికి
చిక్కి మహిళ మృతి
కోలారు : వరికోత యంత్రానికి చిక్కి మహిళ మృతి చెందిన ఘటన ముళబాగిలు తాలూకా దొడ్డగొల్లహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్యామలమ్మ (45) మంగళవారం గ్రామానికి చెందిన గంగాధరప్ప అనే వ్యక్తికి చెందిన వరికోత యంత్రం వద్ద పని చేసేందుకు వెళ్లింది. వరి కట్టను యంత్రంలోనికి వేసే సమయంలో చీర యంత్రం షాఫ్ట్‌కు చిక్కుకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నంగలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పురస్కారాలకు ఆహ్వానం
కోలారు: శ్రీ గురుమునినాగప్ప స్వామి భక్త బృందంచే డిసెంబర్ 21వ తేదీన తాలూకాలోని శెట్టివారిహళ్లి అవధూత క్షేత్ర ఆశ్రమంలో పదవ తరగతి, ఇంటర్‌లో 80 శాతం పైగా మార్కులతో పాసైన బ్రాహ్మణ సముదాయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించనున్నారు. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 12వ తేదీలోగా తమ పేరు, మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్స్‌ను పంపి తమ పేరును నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే
ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే


