క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
బళ్లారిటౌన్: క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని బళ్లారి విభాగం ఉప అరణ్య సంరక్షణ అధికారి డాక్టర్ బసవరాజ్ శ్రేయస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక డీఏఆర్ మైదానంలో చేపట్టిన మూడు రోజుల వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటమిలు సాధారణమన్నారు. గెలుపు వలే ఓటమిని కూడా గౌరవ పూర్వకంగా స్వాగతించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనే అలవాటు చేసుకోవాలన్నారు. పోలీసులు నిత్యం ఎంతో ఒత్తిడితో పని చేస్తారన్నారు. ఇలాంటి క్రీడలతో వారికి మనశ్శాంతి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శోభారాణి మాట్లాడుతూ ప్రతి సమస్యకు పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అవసరమన్నారు. ప్రజలకు పోలీసు శాఖపై ఉన్న నమ్మకానికి సరైన రీతిలో స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వార్షిక క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. అనంతరం కవాతును చేపట్టారు. పరుగు పందెం, కబడ్డీ, జావలిన్ త్రో వంటి వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ నవీన్‌కుమార్, కేపీ రవికుమార్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పీఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
26న మురుగ స్వామి
కేసులో తీర్పు వెల్లడి?
హుబ్లీ: రెండేళ్ల క్రితం చిత్రదుర్గ శివమూర్తి మురుగ స్వామిపై దాఖలైన పోక్సో కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 26న తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు అనుకూల, ప్రతికూల వాద వివాదాలను ఆలకించిన తర్వాత చివరిగా మంగళవారం ప్రభుత్వం న్యాయవాది జగదీశ్ తన ప్రతికూల వాదాన్ని చిత్రదుర్గ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గంగాధరప్ప, చెన్నబసప్ప హడపద ఆలకించారు. వాదోపవాడ ప్రక్రియ ముగిసిన వెంటనే న్యాయమూర్తి ఈ నెల 26కు తీర్పును రిజర్వు చేశారు.
కారంజితో ప్రతిభ వికాసం
హొసపేటె: పిల్లల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని బయటి ప్రపంచానికి ప్రదర్శించడానికి ప్రతిభా కారంజి మంచి వేదిక అని హొసపేటె బీఆర్‌సీ కో–ఆర్డినేటర్ శివకుమార్ అన్నారు. రోటరీ క్లబ్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన కేజీఎస్ క్లస్టర్ స్థాయి ప్రతిభా కారంజి పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. ప్రతిభా కారంజి ద్వారా తమలో దాగి ఉన్న విభిన్న జ్ఞానం, నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుందన్నారు. వారు దానిని సద్వినియోగం చేసుకొని ముందుకు రావాలన్నారు. పిల్లలు పోటీల్లో న్యాయనిర్ణేతలు ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు భరత నాట్యం, ఏకపాత్రాభినయం, కంఠ పాఠంతో పాటు వివిధ సాంస్కృతిక పోటీలను ప్రదర్శించారు. ముఖ్యోపాధ్యాయులు సైదు సాబ్, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు తిమప్ప, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
యూరోపియన్
స్పేస్ ఏజెన్సీకి ఎంపిక
రాయచూరు రూరల్: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి యాదగిరి యువకుడు ఎంపికయ్యాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో స్పేస్ సిస్టం ఇంజినీర్‌గా యాదగిరి జిల్లా వడగేరాకు చెందిన ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థి బసవరాజ్ ఎంపికయ్యారు. మంగళూరు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యనభ్యసించారు. 2016లో మాస్టర్ ఇన్ ఏరో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తర్ఫీదు పొందారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో బాహ్యాకాశంలో ఉప గ్రహాల కార్యాచరణలో విధులు నిర్వహిస్తారు.
ప్లాస్టిక్ నిషేధానికి
అందరూ సహకరించాలి
కేజీఎఫ్ : పర్యావరణానికి చేటు కలిగించే ప్లాస్టిక్‌కు ఉక్కు పాతర వేసేందుకు నగర ప్రజలు సహకారం అందించాలని నగరసభ కమిషనర్ ఆంజినేయులు పిలుపునిచ్చారు. నగరసభ కార్యాలయంలో బుధవారం ఆయన ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఉదయం పౌరకార్మికుల హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు. గైర్హాజరైన కార్మికులకు నోటీసులు ఇవ్వాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్లాస్టిక్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు వినియోగించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి కార్యాలయం, ఆస్పత్రి ప్రాంగణాలలో నోటీసు బోర్డులు అంటించాలన్నారు.
అవసరమైన చోట్ల
బోరుబావుల ఏర్పాటు
కేజీఎఫ్ : నగరోత్థాన 4వ దశ పథకంలో భాగంగా 35 వార్డులలో బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే రూపాశశిధర్ తెలిపారు. బుధవారం ఆమె నగరసభ వ్యాప్తిలోని 11 వ వార్డులో కొత్తగా బోర్వెల్ నుప్రారంభించి మాట్లాడారు. నగరసభ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ దయాశంకర్, కమిషనర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం


