రెండో పంటకు నీరందించండి
రాయచూరు రూరల్ : తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో రెండో పంటకు నీరందించాలని ఆయకట్టు చివరి భూముల రైతు సంఘం అధ్యక్షుడు శంకర్‌గౌడ హరవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ పంటలకు నీరందించడానికి ఉప ముఖ్యమంత్రి అంగీకరించక పోవడాన్ని తప్పుబట్టారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరికకు డ్యాంలో 50 టీఎంసీల నీరున్నా గేట్ల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలన్నారు. 70 ఏళ్ల నాటి అక్విడక్ట్‌లు, రోడ్లు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతు చేపడుతామంటే ఎడమ కాలువ ఆయకట్టులో రైతులు రెండో పంటను వదులుకోడానికి సిద్ధమన్నారు. కేవలం డ్యాం క్రస్ట్‌గేట్ల అమరిక కోసం రైతులు రబీ పంటను వదులుకోవడం వీలు కాదన్నారు.


