ఆల్మట్టి ఎత్తుపై వీడని ప్రతిష్టంభన
రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల రైతులకు జీవనాడి కృష్ణా నదీ పరివాహకంలో నీటి నిల్వను పెంచుకోడానికి ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 30 ఏళ్లుగా పెండింగ్‌లో పడింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు మూడో విడత జారీ అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 524 మీటర్ల ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు 173 టీఎంసీల్లో 130 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశం కల్పించింది. 519 మీటర్ల ఎత్తు నుంచి 524.256 మీటర్ల ఎత్తుకు పెంచితే 9 నూతన నీటి పథకాలకు మార్గం సుగమమవుతుంది.
13.10 లక్షల ఎకరాలకు సాగునీరు
ఈ పథకాల ద్వారా కలబుర్గి, రాయచూరు, కొప్పళ, విజయపుర, యాదగిరి, బాగల్‌కోటె, గదగ్ జిల్లాల్లో 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభిస్తుంది. ఇందుకోసం విజయపురలో రెండు, బాగల్‌కోట జిల్లాలో 20 గ్రామాలను తరలించాల్సి ఉంది. కాలువ నిర్మాణాలకు 96 వేల ఎకరాలు, పునర్వసతికి 1.36 లక్షల ఎకరాల భూ స్వాధీనానికి కేబీజీఎన్‌ఎల్ అధికారులు ిసిద్ధంగా ఉన్నారు. ఈ పథకం పూర్తి చేయడానికి లక్ష కోట్ల రూపాయల నిధులు కావాల్సి ఉంది. అప్పట్లో 3 వేల ఎకరాలకు పరిమితమై ఉండేది. నేడు 30 లక్షల ఎకరాల భూములకు సాగు నీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం అవసరం ఉంది. ఆల్మట్టి డ్యాంలో 130 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 2013–18 వరకు సీఎంగా ఉన్న సిద్దరామయ్య సర్కార్‌లో రూ.7,795 కోట్లు, సంకీర్ణ సర్కార్‌లో రూ.1,079 కోట్లు, బీజేపీ సర్కార్ హయాంలో రూ.6,407 కోట్ల నిధులు కేటాయించింది.
30 ఏళ్లుగా డ్యాం ఎత్తు పెంపునకు ఫలించని ప్రయత్నాలు
519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెరగనున్న ఎత్తు


