సర్వే పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు
కోలారు : అటవీ శాఖ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం నగరంలోని జిల్లాపంచాయతీ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఎఐకెఎస్ రాష్ట్ర నాయకుడు గోపాల్ మాట్లాడుతూ అటవీ ఆక్రమణలను గుర్తించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు. కోలారు కలెక్టర్ నేతృత్వంలో అటవీ భూమిని సర్వే చేసి సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించకముందే అటవీశాఖ అధికారులు రైతుల భూముల వద్దకు వెళ్లి ఆక్రమణల పేరుతో సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. కేపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను అధికారులు ఆక్రమణలు పేరుతో తొలగిస్తున్నారన్నారు. అధికారులు రైతులను దొంగల్లాగా చూస్తున్నారని ఆరోపించారు. వెంటనే సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట నవీన్‌కుమార్, రైతు శిళ్లంగెరె శ్రీనివాస్, గంగమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా రైతుల ధర్నా


