నోరూరించే అరటి మేళా
మైసూరు: మైసూరు నగరంలోని నంజనరాజ బహద్దూర్ హాల్‌లో రెండు రోజుల అరటి మేళా నోరూరిస్తోంది. వందలాది రకాల అరటి కాయలు, పండ్లు కొలువుతీరాయి. సహజ సమృద్ధి సంస్థ, కీ స్టోన్ ఫౌండేషన్, యూసింగ్ డైవర్సిటి సహకారంతో మేళా సాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి అరటి పండ్లను రైతులు, వ్యాపారులు తీసుకువచ్చారు. వాటిని ప్రజలు కొనుగోలు కూడా చేయవచ్చు. మదరంగి, చంద్ర, సహస్ర, మట్టి, బ్లూ జావా, పూజె, కమలాపుర, ఎరుపు, చంగదళి, నల్ల, రసబాలె, చిరుళు, చింగమ్ వంటి పేర్ల కదళీ ఫలాలు అబ్బురపరుస్తాయి. మరో పక్క నంజనగూడు రస అరటి, యాలక్కి, నేంద్ర, పచ్చ అరటి, కర్పూరవళ్లి, పూవన్ అరటి పండ్లు, మొక్కలు లభిస్తున్నాయి. పెద్దసంఖ్యలో నగరవాసులు సందర్శించారు.
భోజనం చేసి వచ్చేలోగా రూ.48 లక్షల నగల లూటీ
మైసూరు: రోడ్డు పక్కన హోటల్ ముందు నిలిపిన కారు అద్దాలను పగలగొట్టి సుమారు 48 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను దోచుకున్నారు. ఈ దోపిడీ మైసూరులోని హుణసూరు హైవేలో ఇలవాళ వద్ద జరిగింది. వివరాలు.. బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్, భార్య, పిల్లలతో కలిసి విరాజపేటలో ఉన్న బంధువుల పెళ్ళికి బయల్దేరారు. ఆ సమయంలో శనివారం రాత్రి భోజనం చేయడానికని హైవేలో ఇలవాళ వద్ద ఓ హోటల్‌కు వచ్చారు. కారును నిలిపి భోజనం చేసుకుని వచ్చారు. కారు అద్దాలు పగలగొట్టి ఉండడం చూసి గాభరాపడ్డారు. లోపల బ్యాగులో దాచిన బంగారం ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఇలవాళ ఠాణాకు వచ్చి బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. రాత్రి సమయం కావడంతో ఎలాంటి చిత్రాలు లభించలేదు.
నది బురదలో
రెండు ఏనుగులు బలి
దొడ్డబళ్లాపురం: ఆర్కావతి నదీ జలాల బురదమట్టిలో ఇరుక్కుని రెండు అడవి ఏనుగులు మృత్యువాత పడ్డాయి, ఈ విషాద సంఘటన కనకపుర తాలూకా సాతనూరు అటవీ ప్రదేశంలో జరిగింది. అడవి ఏనుగులు నదిని దాటుకుని అవతలి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాయి, ఈ క్రమంలో నీటిలోని దట్టమైన గడ్డి– తీగలు, బురద లో చిక్కుకుని బయటకు రాలేక నీటమునిగి మరణించాయి, ఏనుగుల కళేబరాల్ని చూసిన కొందరు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చేరుకుని ఏనుగుల కళేబరాలను వెలికి తీయించారు. పోస్టుమార్టం జరిపి పూడ్చిపెట్టారు.
ఆశా, నర్సు నిర్లక్ష్యం.. తల్లిదండ్రులకు కడుపుకోత
కోలారు: ఇంట్లో శిశువు కేరింతలతో కొత్త కళ వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు, బంధువుల ఆశలు అడియాసలయ్యాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తమ శిశువును బలిగొందని ఆస్పత్రి ముందు బైఠాయించారు. బేతమంగల ఫిర్కా గుట్టహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగింది. వివరాలు.. బాబు, రూప దంపతులు కాగా, రూపకు నెలలు నిండాయి, కాన్పు కోసం గుట్టహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లారు. ఆశా కార్యకర్త, నర్సు వారిని డబ్బులు డిమాండు చేశారు. ముందుగానే హడావుడిగా ప్రసవం చేయడానికి ప్రయత్నించారు, దీనివల్ల మృత శిశువు జన్మించిందని తండ్రి విలపించాడు. ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. శిశువు మరణానికి కారకులై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రైతన్న ఆత్మహత్య
మండ్య: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ సంఘటన మండ్య జిల్లాలోని కేఆర్ పేటె తాలూకాలోని అక్కిహెబ్బాలు హోబ్లి పరిధిలో ఉన్న బెళతూరు గ్రామంలో జరిగింది. కృష్ణే గౌడ (47), 2 ఎకరాలలో సేద్యం చేసుకునేవాడు, రూ.4 లక్షల పైగా అప్పులు ఉన్నాయి. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం లేక ఆవేదనకు లోనయ్యాడు. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
నోరూరించే అరటి మేళా
నోరూరించే అరటి మేళా


