చెరువులో మునిగి ఇద్దరు బాలల మృతి
బొమ్మనహళ్లి: చెరువులో ఉన్న నీటిలో మునిగి ఇద్దరు బాలురు చనిపోయిన ఘటన బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకా అత్తిబెలి దగ్గర బల్లూరులో జరిగింది. బిహార్‌కు చెందిన అనికేతన్ కుమార్ (12), ఏపీలో సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రెహమత్ బాబా (11) మృతులు. ఉపాధి కోసం వీరు ఇక్కడకు వచ్చారు. శనివారం సాయంత్రం సమీపంలోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు, వారికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. మిగతా పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు చెరువు వద్దకు వెళ్లి చూడగా బాలల జాడ లేదు. ఆదివారం ఉదయం పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులో వెతకగా ఇద్దరు బాలల శవాలు బయటపడ్డాయి. బాలల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అతి వేగానికి ఇద్దరు బలి
యశవంతపుర: బైకులో అతి వేగంగా వెళ్తూ రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు, రామనగర జిల్లా మాగడి తాలూకా కుదూరు సమీపంలోని గాంధీ ఫారం వద్ద జరిగింది. మాగడికి చెందిన కేశవ ప్రసాద్ (21), మయూర్ (20) బెంగళూరు నుంచి హాసన్‌కు వెళుతుండగా దారిలో గాంధీ ఫారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కింద పడి తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు.
రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి..
చిక్కమగళూరు సమీపంలో హిరేగౌడ గ్రామం వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చన్నగిరికి చెందిన కుమారప్ప (60), సతీశ్ (35) మరణించగా, మరో డ్రైవరు తీవ్రంగా గాయపడ్డాడు.
హేళన పోస్టింగులపై కేసులు
శివాజీనగర: సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న పోరు మీద కొందరు హేళన చేసేలా గ్రాఫిక్స్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అదే మాదిరిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్యల మీద ఏఐ ద్వారా పోస్టులను పెట్టారు. ఓ సభలో సీఎం సిద్దరామయ్యను కుర్చీ నుంచి డీకే కిందకు పడదోసినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. కన్నడ సినీ రంగం అనే పేరు గల ఇన్‌స్టా ఖాతా ద్వారా పోస్టు చేయగా, సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో ద్వారా అశాంతిని పుట్టించేలా కుట్ర జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు నవంబరు వచ్చినా సీఎం పదవి రాలేదేమిటా అని శివకుమార్ ఆతృతగా మొబైల్‌లో చూడడం, అది చూసి రాహుల్‌గాంధీ, సిద్దరామయ్య పగలబడి నవ్వుతున్నట్లు మరో మెమె విడుదలైంది.
15న సీఎం ఢిల్లీలో విందు భేటీ
శివాజీనగర: కాంగ్రెస్‌లో మంత్రిమండలి పునర్విభజన, సీఎం మార్పు చర్చల మధ్య సీఎం సిద్దరామయ్య వర్గం విందు ఎంపీ రాజశేఖర్ హిట్నాళ్ ఢిల్లీ నివాసానికి మారింది. మొదట మాజీ మంత్రి రాజన్న ఇంటిలో జరపాలని అనుకున్నారు. సీఎం సిద్దరామయ్య బిహార్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజునే అంటే 15వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ సీఎం, సన్నిహితులు హిట్నాళ్ ఇంటిలో భారీ విందు ఇవ్వబోతున్నారు. సిద్దరామయ్య తన బల ప్రదర్శనకు దీనిని వాడుకోబోతున్నట్లు సమాచారం. గత శుక్రవారం మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ తుమకూరులోని తన ఇంట్లో సీఎం, సన్నిహితులకు భోజన విందు ఏర్పాటు చేసినా సీఎం బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయారు. సీఎం వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరికీ ఢిల్లీ విందుకు పిలుపు వెళ్లింది. సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగించాలని ఇందులో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం.


