బైక్, కారును ట్యాంకర్ ఢీ
● నలుగురు మృత్యువాత
కలబుర్గి (దొడ్డబళ్లాపురం): వేగంగా వచ్చిన ట్యాంకర్ వాహనం ఎదురుగా వస్తున్న బైక్, కారుని ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటన శుక్రవారం రాత్రి కలబుర్గి తాలూకా అవరాద గ్రామం వద్ద బీదర్– శ్రీరంగపట్టణ హైవేలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న శిరడోణ గ్రామం వాసులు నాగేంద్ర, శివానంద అక్కడికక్కడే మరణించారు. బైక్‌లోని ఉత్తమ మైలారి అనే వ్యక్తి తీవ్రంగా గాయపపడ్డాడు. కారులో ఉన్న బాల్కి వాసులు దత్తాత్రేయ చిమాజి (48), చంద్రకళ (70) గాయాలతో చనిపోయారు. బైక్, కారు హుమనాబాద్ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్యాంకర్ ఆ వాహనాలను ఢీకొంది. బెళగావి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కులాలపై కనకదాస పోరాటం
మైసూరు: నగరంలోని కంసాళె మహదేవయ్య సర్కిల్‌లో 538వ జయంతి సందర్భంగా శనివారం కనక సేనా సమితి ఆధ్వర్యంలో కనకదాసు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రజలకు మైసూరు పాక్ మిఠాయిని పంచిపెట్టారు. ముడా మాజీ అధ్యక్షుడు హెచ్‌వీ రాజీవ్ మాట్లాడుతూ కనకదాసు ఏ ఒక్క కులానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. కులం కోసం కొట్లాడవద్దు అని ఆనాడే కుల సంఘర్షణలకు వ్యతిరేకంగా సామాజిక జాగృతి కల్గించారన్నారు. కనకదాస జీవితం ఆదర్శప్రాయమన్నారు. పెద్దసంఖ్యలో స్థానికులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
మూక దాడిలో జీపీ
సభ్యుని హత్య
మైసూరు: గుంపు యథేచ్ఛగా కత్తులతో దాడి చేసి గ్రామ పంచాయతీ సభ్యున్ని హతమార్చిన ఘటన జిల్లాలోని హుణసూరులోని షబ్బీర్ నగరలో జరిగింది. మైసూరు జిల్లా సాలిగ్రామ తాలూకాలోని హొన్నేనహళ్లి జీపీ సభ్యుడు ఖిజర్ పాషా (47) షబ్బీర్‌నగర్‌లో ఓ ఇంటిలో ప్రార్థనలు చేసేందుకు తన సోదరి కుమారుడు ఉమర్, సోదరుని కుమారుడు అబ్దుల్ అన్నన్‌తో కలిసి వచ్చారు. ఈ సమయంలో సాలిగ్రామకు చెందిన ఎజాజ్ పాషా కుమారుడు మహ్మద్ సాద్, అనుచరులతో వచ్చాడు, మసీదు బయట నిలబడిన ఖిజర్ పాషాను కత్తులతో నరికి చంపారు. వారిని అడ్డుకోబోయిన సోదరి కుమారుడు, బంధువు ఉమర్‌కు వీపు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్పీ మల్లిక్, డీఎస్పీ రవికుమార్, ఎస్‌ఐ జమీర్ అహ్మద్ చేరుకుని పరిశీలించారు. ఆరు నెలల క్రితం నుంచి భూ వివాదం సాగుతోందని, అదే కారణమని హతుని కొడుకు తెలిపాడు. దుండగుల కోసం గాలింపు సాగుతోంది.
74 శవాల మిస్టరీ తేలాలి
● ధర్మస్థలపై హైకోర్టులో పిటిషన్
దొడ్డబళ్లాపురం: ధర్మస్థల చుట్టుపక్కల 74 అనాథ శవాలను పూడ్చిపెట్టినట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో 74 ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసి దర్యాప్తు చేయాలని బెళ్తంగడి మృత విద్యార్థిని సౌజన్య తల్లి హైకోర్టులో పిల్‌ను దాఖలు చేసింది. ప్రతి కేసులో శవం పూడ్చిన చోట తవ్వకాలు జరిపి ఫోరెన్సిక్ పరీక్షలు జరిపించాలి, నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తే మృతుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. సమగ్రంగా దర్యాప్తు చేస్తే వారి మృతికి కారణాలు కూడా కనిపెట్టవచ్చు. ప్రతి చావు వెనుక దాగి ఉన్న నిందితులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలి అని పిటిషన్‌లో ఆమె పేర్కొంది. కనబడకుండాపోయిన వారి కుటుంబాలు నేరుగా ఎస్‌ఐటీ అధికారులను కలిసే అవకాశం ఇవ్వాలని కోరింది.
కుశాల గణపతి రథోత్సవం
యశవంతపుర: కొడగు జిల్లాలోని కుశాలనగరలో ప్రసిద్ధ గణపతి దేవస్థాన 105వ బ్రహ్మరథోత్సవం శనివారం కనులపండువగా జరిగింది. తేరు సంబరంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెండి గణపతి ఉత్సవమూర్తిని తేరులో కూర్చోపెట్టి భక్తులు బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. కర్పూరం అంటించి హారతులు అందించారు. మధ్యాహ్నం ఒంటి గంట కొబ్బరికాయలు కొట్టి తేరును లాగారు. వేలాదిమంది పాల్గొన్నారు.
బైక్, కారును ట్యాంకర్ ఢీ
బైక్, కారును ట్యాంకర్ ఢీ


